డిఎస్సీ వేయకపోతే ప్రపంచం మునిగిపోదన్న కేసిఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం నారాయణఖేడ్ లో రామకృష్ణ మరణానికి డిఎస్సీ రాకపోవడమే కారణమన్న కోదండరాం రామకృష్ణ మరణానికి సమాధానం చెప్పాలని డిమాండ్
తెలంగాణ సిఎం కేసిఆర్ కు జెఎసి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మరో సవాల్ విసిరారు. డిఎస్సీ వేయకపోతే ప్రపంచం మునిగిపోతుందా అని సిఎం కేసిఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కోదండరాం ఈ సవాల్ చేశారు.
నారాయణఖేడ్ లో డిఎస్సీ ఆలస్యం కావడంతో మానసికంగా కుంగిపోయి రామకృష్ణ అనే యువకుడు చనిపోయిన విషయం తెలిసిందే. రామకృష్ణ మరణంతో ఆ కుటుబం రోడ్డున పడ్డది. ఆ ఇంట్లో ఇద్దరు డిఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు.
రామకృష్ణ సోదరి కూడా డిఎస్సీ కోసం ఎదురుచూస్తున్నది. గత మూడేళ్లుగా తెలంగాణ సర్కారు డిఎస్సీ వేయకపోవడంతోనే అతడు మానసిక కుంగుబాటుతో మరణించాడని కుటుంబసభ్యులు తెలిపారు.
సంగారెడ్డి పర్యటనలో భాగంగా జెఎసి ఛైర్మన్ కోదండరాం సోమవారం రామకృష్ణ కుటుంబసభ్యులను పరామర్శించారు. (ఫొటో కింద చూడొచ్చు.)

డిఎస్సీ వేయకపోతే ప్రపంచం మునిగిపోయిందో లేదో కానీ రామకృష్ణ అనే యువకుడు మాత్రం మునిగిపోయాడని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు.
డిఎస్సీ విషయంలో ఆదినుంచి తెలంగాణ సర్కారు వ్యతిరేక భావనతో ఉందని కోదండరాం విమర్శించారు. తెలంగాణ తెచ్చుకున్నదే నియామకాల కోసం అయినప్పుడు ఆ దిశగా సర్కారు ఎందుకు చర్యలు చేపట్టడంలేదని ప్రశ్నించారు.
డిఎస్సీపై పూటకోమాట మాట్లాడిన ఫలితంగా యువత తీవ్ర నిరాశలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
రామకృష్ణ మరణం తెలంగాణ ప్రభుత్వానికి కనిపించడంలేదా అని నిలదీశారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
