తెలంగాణ సర్కారుకు జెఎసి గట్టి సవాల్ విసురుతోంది. కెసిఆర్ కోటలో అమరుల స్పూర్తియాత్రకు దిగుతోంది. తొలి దశ యాత్ర అంతా కెసిఆర్ కంచుకోటల్లోనే సాగనుంది. కోదంరాం యాత్ర షెడ్యూల్ ప్రకటించడంతో మెతుకు సీమ రాజకీయం వేడెక్కింది.
తెలంగాణ జెఎసి తలపెట్టిన అమరవీరుల స్పూర్తియాత్ర షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 21 నుంచి 24 వరకు నాలుగు రోజులపాటు సాగనుంది స్పూర్తి యాత్ర. కెసిఆర్ సొంత జిల్లా అయిన ఉమ్మడి మెదక్ జిల్లాలోనే తొలి దశ అమరుల స్పూర్తియాత్రకు కోదండరాం చేపట్టనుండడం చర్చనీయాంశమైంది. ఈ యాత్ర ద్వారా తెలంగాణ సర్కారు వైఖరిని గట్టిగానే విమర్శించేందుకు జెఎసి ప్లాన్ చేస్తోంది. అమరవీరుల కుటుంబాలను ఆదుకోలేదన్న విషయాన్ని జెఎసి గట్టిగా జనాల్లోకి తీసుకుపోనుంది.
మరోవైపు కోదండరాం యాత్ర నేపథ్యంలో గులాబీ శ్రేణుల అటెన్షన్ పెరిగిపోయింది. కోదండరాం ఏం ప్రస్తావించినా ఆయనను కాంగ్రెస్ ఏజెంట్ గా అభివర్ణిస్తూ ఆయనపై ఎదురుదాడి చేయాలన్న యోచనలో గులాబీ దళం సమాయత్తమవుతోంది. అధికార టిఆర్ఎస్ ఇప్పటికే కోదండపై బాల్క సుమన్ ను ప్రయోగించింది. కోదండరాం ను నిలదీయాలంటూ బాల్క సుమన్ టిఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చి ఉన్నారు.
ఈనెల 21న ఉదయం 8గంటలకు గన్ పార్కు వద్ద ఈ స్పూర్తి యాత్రకు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య జెండా ఊపి ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కోదండరాం సంగారెడ్డి వెళ్లి అక్కడ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
మొత్తానికి జెఎసి అమరుల స్పూర్తి యాత్ర ఎలాంటి పరిణామాలకు వేదిక అవుతుందో అన్నది చూడాల్సి ఉంది.
