Asianet News TeluguAsianet News Telugu

ఆరేడు నెలలు ఆగండి.. తర్వాత మనదే పైచేయి

  • తెలంగాణ వ్యతిరేక శక్తులు ప్రభుత్వంతో అంటకాగుతున్నాయి
  • కమిషన్ల కోసమే కేసిఆర్ సర్కారు ఆరాటపడుతున్నది.
  • తెలంగాణవాదులు దూరమయ్యారు, ఉద్యమ ద్రోోహులు దగ్గరయ్యారు
  • డిఎస్సీపై సర్కారు ది కపట నాటకమే
Kodandaram foresees weakening of KCR government in six months

తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరాం సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం సాయంత్రం ఫేస్ బుక్ లైవ్ లో కీలకమైన, సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. ఈ ప్రభుత్వం ఇంకా ఆరేడు నెలలు మాత్రమే మన మీద వత్తిడి పెడతది. కానీ తర్వాత పరిస్థితులు మారిపోతాయి. మనం భయపడాల్సిన పనిలేదు. అప్పుడు మనదే పై చేయి అవుతుంది అని కోదండరాం స్పస్టం చేశారు. ఇంకా కోదండరాం లైవ్ కార్యక్రమంలో ఏమేం మాట్లాడారో ఇక్కడ చదవండి.

 

ప్రభుత్వం చేపడుతున్న విధానాల్లో లోపాలను ప్రజలకు తెలియజెప్పేందుకే యాత్ర చేస్తున్నాం. ఉద్యోగాల విషయంలో మూడేళ్లు గడుస్తున్నా ఏరకమైన విధానం రూపొందించుకోలేకపోయింది. నీళ్లు, నిధులు, నియామకాలలో నియామకాల విషయంలో ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పటి వరకు చూస్తే 2లక్షల ఖాళీలు ఉన్నాయి. మూడున్నరేళ్లలో ఉద్యోగాల భర్తీపై ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. నిరుద్యోగుల ఆవేదనను వీసమెత్తు కూడా సిఎం కేసిఆర్ అర్థం చేసుకోలేదు. డిఎస్సీ వేయకపోతే ప్రపంచం మునిగిపోతదా అని మాట్లాడడం దారుణం.

నారాయణఖేడ్ లో రామకృష్ణ అనే నిరుద్యోగి డిఎస్సీ కోసం బలిదానం చేసిండు. అవనిగడ్డలో కోచింగ్ తీసుకున్నాడు. రామకృష్ణ. అయినా నోటిఫికేషన్ రాకపోవడంతో కుంగి కుశించి చనిపోయాడు. ఉద్యోగాల భర్తీ కోసం సర్కారు చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ దాన్ని పూర్తిగా విస్మరించింది. అనేక మంది యువతీ యువకులు ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఉన్నారు. ఉద్యమ కాలంలో ఉద్యోగాల కోసమే తెలంగాణ తెచ్చుకునేందుకు ఆత్మబలిదానాలు చేసుకున్నారు.

చాలా గ్రామాల్లో పైపులైన్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నప్పటికీ వాటిని తొలగించి మళ్లీ కొత్తవి వేస్తున్నారు. దానివల్ల కాంట్రాక్టర్లకు లాభం అయితది. కమిషన్లు వస్తాయి కాబట్టే దానికోసం ఆరాటపడుతున్నారు. ఇక్కడ జాబులు నింపితే వచ్చే ఆర్థిక ప్రయోజనాలేమీ లేవు కాబట్టి పట్టించుకోవడంలేదు. కాంట్రాక్టర్లకు మేలు చేకూర్చేందుకే పనిచేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ కోసం ఒక క్యాలెండర్ ప్రకటించాలి. దానివల్ల విద్యార్థులు కేరీర్ ప్లానింగ్ చేసుకునే అవకాశం ఉంటది. అయితే ఇప్పటి వరకు క్యాలెండర్ రాలేదు. స్థానిక పరిశ్రమలలో భూమి పుత్రులకే ఉద్యోగాలివ్వాలని ఒక జిఓ ఇస్తే సరిపోతది. అయినా ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టిర్రు.

ఉద్యోగ కల్పన లక్ష్యంగా బడ్జెట్ నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని మనం కోరుతున్నాం. ఆ ప్రయత్నం ప్రభుత్వం నుంచి జరగడంలేదు. నిరుద్యోగులకు భృతి కల్పించాలి. ఉద్యోగం అన్నా ఇవ్వాలి. లేదంటే నిరుద్యోగ భృతి అయినా కల్పించాలి. ఇప్పటి నుంచి ఏమాత్రం ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను నియమించడానికి వీలు లేదు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం మీద వత్తిడి పెట్టడానికే ఈ కార్యాచరణ ఇంకా ముందుకు తీసుకుపోయేందుకు ఆందోళన చేస్తున్నం. అక్టోబరు 31నాడు కొలువులకై కొట్లాట చేపడుతున్నం. ఎల్బీ నగర్ పరిసరాల్లో ఈ కార్యక్రమం ఉండే అవకాశం ఉంటది. దీనిపై కూడా అమరుల యాత్రలో భారీగా ప్రచారం చేయాలని అనుకున్నం.

పట్టుమని పది మంది కూడా ఉంటలేరు. ఎక్కడా 500 మంది రాట్లేరు అని సిఎం గారు అన్నారు. కానీ మనం ఎక్కడ పైసలు పంచి జనాలను తీసుకొస్తలేము. అందరూ స్వచ్ఛందంగానే యాత్రలో పాలుపంచుకుంటున్నారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తే తప్పేంటి సార్ అని యాత్రలో పాల్గొన్న జనాలు అంటున్నరు. రేపు ఎల్లుండి జరిగే యాత్రకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పేరు పేరున కోరుతున్నాం. కక్ష కట్టి ముఖ్యమంత్రి మన మీద పెద్ద ఎత్తున దాడికి పాల్పడుతున్న తరుణంలో ప్రశ్నించే ప్రయత్నానికి మద్దతు పలకాలని కోరుతున్నాను. మనమందరం సంఘటితమై ప్రభుత్వంపై వత్తిడి పెంచడానికి కలిసి రావాలని కోరుతున్నాను.

జనగామ జిల్లాలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేయాల్సిందిపోయి కలెక్టర్ మీదే చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం వస్తున్నది. కానీ తక్షణమే ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. జనగామ ఎమ్మెల్యే అవినీతిపై గట్టిగానే పోరాటం చేయాలని నిర్ణయించాము. వారసత్వ ఉద్యోగాల విషయంలో కోర్టు ఏవిధమైన అభ్యంతరం తెలపలేదు. ఈ విషయాన్ని సరిచేసి ఒక ఉత్తర్వు ఇచ్చి ఉంటే సరిపోయేది. కానీ కార్మికుల వత్తిడి మేరకు హామీ ఇచ్చారు. కానీ దీపావళి లోపు ఈ హామీ మరి అమలు చేస్తరా ఉత్తదేనా అన్నది తేలాల్సి ఉంది.

తాడిచెర్ల గనులు ప్రయివేటుకు ఇచ్చిర్రు. ఆ లబ్ధి పొందుతున్న వారిలో అధికార పార్టీ నాయకుడు కూడా ఉన్నరు. అవినీతికి పాల్పడే వారిపై చర్యలు తీసుకుంట అంటరు ముఖ్యమంత్రి గారు. కానీ అవినీతికి పాల్పడే ఎమ్మెల్యేలపై చర్యలు మాత్రం తీసుకోరు. మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయింది. అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోతున్నది. మరిన్ని అప్పులు చేయబోతున్నారు. మళ్లీ ఎన్నికల నాటికి 2లక్షల కోట్ల అప్పులు చేసే అవకాశం ఉంది. ఈ అప్పులు దేనికోసం తెస్తున్నారంటే మిషన్ భగీరథ, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పెంచిన రేట్లకు ఇస్తున్నారు. మిషన్ బగీరథ రిజర్వాయర్లు ఎక్కడొస్తయో తెలియకుండానే పైపులేస్తున్నరు. మరి  ఈ డబ్బంతా దుర్వినియోగమే కదా?

ప్రభుత్వ తప్పిదాల వల్ల ప్రజల మీద రుణభారం పెరిగిపోతున్నది. సర్కారు తప్పిదాలను ప్రశ్నిస్తున్నాం కాబట్టే జెఎసి పైన ప్రభుత్వం రకరకాల దుష్ర్పచారాలకు పాల్పడుతున్నది. అధికార దుర్వినియోగానికి అడుగడుగునా పాల్పడుతున్నది. హైదరాబాద్ లో ఉన్నటువంటి విక్టోరియా మెమోరియల్ హోం ను ఏర్పాటు చేశారు నిజాం వందేళ్ల క్రితం. అనాదల కోసం అది ఏర్పాటైంది. కానీ ఆ స్థలాన్ని ప్రభుత్వం పోలీసు కమిషనరేట్ కోసం తీసుకుంటున్నది. జహీరాబాద్ లోనిమ్జ్ పేరుతో ప్రొడక్షన్ జోన్ ఏర్పాటు చేస్తున్నారు. దానికోసం వేలాది ఎకరాలు సేకరిస్తున్నారు. కానీ సేకరించిన భూమిలో మూడో వంతు ఖాళీగా ఉంది. కానీ ఆ భూమిని సద్వినియోగం చేసుకోకుండానే పెద్ద మొత్లంలో సేకరిస్తున్నారు.

రైతు సమన్వయ సమితులు అవసరం లేదని మనమంటుంటే భూమి సర్వే వద్దా అని ప్రభుత్వం అంటున్నది. భూమి సర్వే వద్దని మనమేమీ చెప్పడంలేదు. కానీ సమన్వయ సమితి వద్దని మనం చెబుతున్నం. గ్రామాల అభివృద్ధి కోసం సమన్వయ సమితిలు ఏమాత్రం పనిచేయవు. బ్రోకర్ వ్యవస్థ వస్తుంది. యూనివర్శిటీ నియామకాల భర్తీ అంశాన్ని టిఎస్పిఎస్సీకి ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ యూనివర్శిటీ చట్టానికి విరుద్ధం. ఇది యూనివర్శిటీ స్వయం ప్రతిపత్తికి ప్రమాదం. దీన్ని వ్యతిరేకించాలని పిలుపునిస్తున్నాం.

డిఎస్సీ వచ్చింది కదా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సీ వస్తుంది కాబట్టి కొలువులకై కొట్లాట సభను ప్రకటించిన ఫలితంగానే ప్రభుత్వం నుంచి కదలిక వచ్చింది. ఈ సందర్భంలోనే డిఎస్సీ రాబోతున్నట్లు అంటున్నారు. డిఎస్సీ రావడానికి ఉన్న నేపథ్యాన్ని గ్రహించాలి. రాష్ట్రంలో తగినంత మంది టీచర్లు లేరని స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టులో కేసు వేశాయి. ఖాళీలను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు అక్టోబరు 31 నాడు కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలిచ్చింది. ఆ కోర్టు తీర్పు నేపథ్యంలోనే టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చిందని చెప్పాలి.

ముఖ్యమంత్రి గారు జోనల్ వ్యవస్థ మార్పుపై కమిటీ వేశారు. కానీ అంతకుముందు డిఎస్సీ వేయకపోతే ప్రపంచం మునిగిపోతదా అని కూడా సిఎం గారు మాట్లాడిర్రు. ప్రభుత్వానికి ఉద్యోగాలపై చిత్తశుద్ధి ఉంటే ఈపాటికే కొత్త జోన్లపై రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు వచ్చి ఉండేవి. భూసేకరణ చట్టం విషయంలో హడావిడిగా చేశారు. ప్రగతి భవన్ నిర్మాణం విషయంలో చాలా మంది అభ్యంతరం తెలిపిర్రు. కానీ ఏడాదిలో ఆ భవనం పూర్తి చేశారు. ఒక భవనం ఉండగానే మరో భవనం వద్దన్నారు. కానీ నిర్మించారు. వారు అనుకున్నది ఆగమేఘాల మీద చేస్తున్నారు. కానీ ఉద్యోగాల భర్తీ మాత్రం మూడున్నరేళ్లలో ఏమాత్రం చేయలేదు. సర్కారు సీరియస్ గా తీసుకోవాలన్న ఉద్దేశంతోనే కొలువులకై కొట్లాట సభ జరుపుతున్నాం. ఉద్యోగాల భర్తీ సీరియస్ గా పట్టించుకుంటలేదు కాబట్టే మనం ఈ సభ పెడుతున్నం.

రాష్ట్రంలో లక్షా 20వేల ఖాళీలు ఉన్నయన్న మాట ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించారు. కొత్త జిల్లాలతో మరో పదివేల పోస్టులు కావాల్సి వచ్చాయి. రిటైర్ మెంట్ల వల్ల ఇంకొన్ని ఖాళీలు కలిసివచ్చాయి. మొత్తం కలిసి 2లక్షల వరకు ఖాళీలు ఉన్నాయి. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వడం ఎలా సాధ్యం అని సిఎం అంటున్నారు. కానీ ప్రతి ఇంటికి ఉద్యోగం కావాలని ఎవరూ అడగడంలేదు. కానీ ఖాళీలు భర్తీ చేయాలంటున్నం.

మంత్రులందరూ ఉత్సవ విగ్రహాలైపోయిర్రు. పేరుకే ప్రొటొకాల్ ఉంది కానీ అధికారాలు లేవని అసంతృప్తితో ఉన్నారు.

హోమంత్రి ఎస్సైని బదిలీ చేయించే పరిస్థితుల్లో లేరు.

ఫైనాన్స్ మంత్రి కి నిధుల మంజూరిపై అధికారం లేదు.

ఎక్సైజ్ శాఖ మంత్రి తన శాఖలో ఒక్క పాలసీ చేయలేడు.  

వైద్య శాఖ నిర్ణయాలన్నీ సిఎం కార్యాలయంలోనే జరుగుతాయి.

ప్రభుత్వం నిరంకుశంగా అధికారం చెలాయించాలన్న తాపత్రయం ఉంది. ప్రజలు మాకు అధికారం ఇచ్చిర్రు మీరంతా మమ్మల్ని ఏమీ అడగొద్దన్న మాట వారు అంటున్నారు. అందులో భాగంగానే జెఎసి కూడా అవసరం లేదని అంటున్నారు. కానీ ప్రజలు తమ తరుపున మాట్లాడుతున్న సంస్థగా చూస్తున్నారు. జెఎసి పిలుపులకు ప్రజలు స్పందిస్తున్నారు. అన్ని జిల్లాల్లో జెఎసి నేతల మీద కేసులు పెడుతున్నరు. కానీ ఎన్ని కేసులు పెట్టినా తెలంగాణ రాకుండా ఆగలేదు. ఇప్పుడు కూడా కేసులు పెట్టి భయపెట్టాలనుకుంటే సాధ్యమయ్యే పనికాదు.

మహా అంటే ఈ ప్రభుత్వం ఆరు నెలలు, ఏడు నెలలు వత్తిడి పెడుతుంటది. ఆ తర్వాత పరిస్థితులు మారిపోతాయి. ఆ తర్వాత మనదే పైచేయి అయితది. తెలంగాణ ఉద్యమం అంతా నేనే చేశానని సిఎం అంటున్నారు. కానీ అందరి కృషితోనే వచ్చింది. ఇందులో గొప్పగా త్యాగం చేసింది ఎవరంటే అమరులు మాత్రమే. వారు చేసిన త్యాగాలను గుర్తు పెట్టుకోవాలి. సిఎం నిరంకుశమైన పోకడలకు పాల్పడుతున్నారు. అధికారాన్ని ఇష్టానుసారం ఉపయోగిస్తామంటున్నారు. బడ్జెట్ ను, వనరులను మా ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకుంటామని అంటున్నారు.

యాత్రకు పర్మిషన్ విషయంలో ఇంకా తేలలేదు. తెలంగాణ ప్రజలు దూరమైపోయిర్రు. ఆంధ్రా కాంట్రాక్టర్లు దగ్గరైపోయిర్రు. కమిషన్ల కోసమే ఆరాటపడుతున్నారు. 500 కోట్ల సొమ్మను ఆశ చూపి మీడియా నోరు నొక్కేశిర్రు. సోషల్ మీడియా విస్తరించడంతో పరిస్థితి మారిపోయింది. జియో ఫోన్లతో నెట్ చౌకగా దొరుకుతున్నది. ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. కానీ సోషల్ మీడియా గొంతు నొక్కే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ సాధ్యమయ్యే పరిస్థితి కాదు. 

ఉద్యమ  ఆకాంక్షల కోసం మనం పనిచేస్తున్నాం. వ్యక్తిగత ప్రయోజనాలు పొందేందుకు నిరంకుశత్వంతో పనిచేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. కానీ మనం ప్రజాస్వామ్యం కోసం ఆరాపటడుతున్నాం. ఈ ప్రయత్నానికి అందరూ కలిసి రావాలని పిలుపునిస్తున్నాం.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/cJzb9d

 

Follow Us:
Download App:
  • android
  • ios