కేంద్రం నిర్ణయంపై మండిపడ్డ కోదండరాం
పెద్ద నోట్లు రద్దు చేసిన కేంద్రం మరో వైపు బడాబాబులకు అనేక మినహాయింపులు ఇవ్వడం దారుణమని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరాం విమర్శించారు. బ్లాక్ మనీ నియంత్రణ కోసం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సమంజసమే అయినప్పటికీ సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ రోజు ఆయన హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థూల జాతీయ ఉత్పత్తిలో 30 శాతం నల్లధనమే ఉండడం వల్ల ఆర్థిక వ్యవస్థ నియంత్రణ కొద్దిమంది చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. 1978లో పెద్ద నోట్లు రద్దు చేసినా సామాన్య ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేదని, ప్రస్తుతం వాడుకలో ఉన్న నగదు మొత్తంలో 86 శాతం పెద్ద నోట్లే ఉండటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.
పేదల ఇబ్బందులు తొలగించేందుకు కేంద్రం నగదు చెలామణి విస్తృతం చేయాలని కోరారు. రాష్ట్రాలు కేవలం స్థిరాస్తి ఆదాయంపైనే ఆధారపడకుండా సమగ్ర విధానాన్ని రూపొందించుకోవాలని అభిప్రాయపడ్డారు.
