ఇన్నాళ్లు తన పై వస్తున్న విమర్శలకు సైలెంట్ గా ఉన్న కోదండరాం ఇటీవల కాస్త స్వరం మార్చారు. వ్యక్తిగత విమర్శలకు దిగకున్నా.. ఆ స్థాయిలోనే ప్రభుత్వ పెద్దలకు చురకలు అంటిస్తున్నారు.

తెలంగాణ రాజకీయ జేఏసీకి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందనే విషయం తెలిసిందే. మల్లన్న సాగర్ ముంపు బాధితులు, విద్యుత్ కోనుగోళ్లు, ప్రాజెక్టుల రీ డిజైన్ , ఉద్యోగ నియామకాలు తదితర అంశాలపై టీ జేఏసీ బహిరంగంగానే పాలక పార్టీపై విమర్శలు గుప్పిస్తోంది.

దీనికి టీఆర్ ఎస్ ప్రభుత్వం కూడా ధీటుగా జవాబులిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కలసి నడిచిన టీ జేఏసీ చైర్మన్ కోదండరాం ను కాంగ్రెస్ ఏజెంట్ గా విమర్శించడానికి ఏ మాత్రం సందేహించడం లేదు.

ఇన్నాళ్లు తన పై వస్తున్న విమర్శలకు సైలెంట్ గా ఉన్న కోదండరాం ఇటీవల కాస్త స్వరం మార్చారు. వ్యక్తిగత విమర్శలకు దిగకున్నా.. ఆ స్థాయిలోనే ప్రభుత్వ పెద్దలకు చురకలు అంటిస్తున్నారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర గత శుక్రవారం నాటికి 90వ రోజు కు చేరింది. ఈ సందర్భంగా మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ఓ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

ఈ సభ కు కోదండరాం మఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఓ పిట్ట కథ చెప్పి పాలకుల తీరును ఎండగట్టారు.

‘ఓ గొర్రె ల కాపరి గొంగళి వేసుకుని తన మందలోని గొర్రెలను మేతకు తీసుకెళ్తున్నాడట. ఆ మందలో ఉన్న ఓ గొర్రె మరో గొర్రెతో మాట్లాడుతూ... మన యజమాని ఆయన ఒంటి మీద ఉన్న గొంగళి లాంటిదే మన ఒంటి మీద కూడా కప్పాడు, అందుకే మనకు వెచ్చెగా ఉంది అని అమాయకంగా చెప్పిందట.

అయితే నిజానికి గొర్రెల కాపరి వేసుకున్న గొంగళినే తమ వెంట్రుకల నుంచి తయారు చేశారనే విషయాన్ని ఆ గొర్రెలు గ్రహించలేదు.

అలా గ్రహించినప్పుడు గొర్రెల్లో తిరుగుబాటు వస్తోంది‘ అని కోదండరాం తన పిట్ట కథను ముగించారు. ఈ కథలో గొర్రెలు ఎవరో, కాపరి ఎవరో సభకు వచ్చిన జనాలకు బాగానే అర్థమైందనుకుంటా... చప్పట్లతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.

పాలకుల నైజాన్ని కోదండరాం ఇలా పిట్టకథలో భలేగా చెప్పారని అక్కడున్న కమ్యూనిస్టు నేతలు కూడా ప్రశంసించారు.

ఇక గులాబీ నేతలు కూడా ఆ కథ సీఎంను ఉద్దేశించే చెప్పారని చెవులుకొరుక్కున్నారు. అంతేకాదు తమ అధినేత చెవిన ఈ కథ ను ఏవరు చేరవేస్తారా అని తెగ హైరానా పడుతున్నారు.