వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్య కేసు: సైఫ్ పై సస్పెన్షన్ తాత్కాలికంగా ఎత్తివేత
వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న సైఫ్ పై సస్పెన్షన్ తాత్కాలికంగా ఎత్తివేసింది కాలేజీ. హైకోర్టు ఆదేశాల మేరకు సస్పెన్షన్ ఎత్తివేసింది కాలేజీ.
వరంగల్: వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ సైఫ్ పై సస్పెన్షన్ ను తాత్కాలికంగా ఎత్తివేశారు.ఈ ఏడాది ఫిబ్రవరి 22న మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. హైద్రాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ ప్రీతి ఫిబ్రవరి 26న మృతి చెందింది. ప్రీతి మృతికి ఆమె సీనియర్ సైఫ్ వేధింపులు కారణమని వరంగల్ పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో సైఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రీతి మృతి కేసు విషయాన్ని కాలేజీ సీరియస్ గా తీసుకుంది.
ఏడాది పాటు సైఫ్ పై సస్పెన్షన్ వేటేసింది. తనపై కాలేజీ సస్పెన్షన్ వేటేయడంపై సైఫ్ హైకోర్టును ఆశ్రయించారు. తన వివరణ తీసుకోకుండానే సస్పెండ్ చేశారని సైఫ్ పేర్కొన్నారు. అయితే సైఫ్ వివరణ తీసుకోవాలని కేఎంసీ కాలేజీని హైకోర్టు ఆదేశించింది. గత నెల 29న యాంటీ ర్యాగింగ్ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని కాలేజీ యాజమాన్యం సైఫ్ ను ఆదేశించింది. అయితే సైఫ్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. తాత్కాలికంగా సైఫ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని హైకోర్టు ఆదేశించింది. వారం రోజుల తర్వాత వివరణ తీసుకోవాలని ఆదేశించింది.