హైదరాబాద్: తెలుగురాష్ట్రాల్లో డెంగీ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రజల ప్రాణాలను బలితీసుకుంటుంది. గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విషజ్వరాలు ప్రజలను పట్టుకుని పీడిస్తున్నాయి. ఈ విషజ్వరాల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 

ఈ డెంగీ మహమ్మారి బారినపడి ఖమ్మం జిల్లాకు చెందిన జూనియర్ సివిల్ జడ్జి ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయమూర్తిగా ఎం జయమ్మ పనిచేస్తున్నారు. 

డెంగ్యూ జ్వరం రావడంతో ఆమెను హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న జయమ్మ సోమవారం తెల్లవారు జామును రెండుగంటల ప్రాంతంలో ప్రాణాలు విడిచారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జయమ్మ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేశారు. హైకోర్టు విభజనలో భాగంగా ఆమె గత ఏడాది డిసెంబర్‌లో ఖమ్మం రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యారు.

ఇకపోతే ఇటీవలే చిత్తూరు జిల్లాలో బాల నటుడు గోకుల్ సాయిని కూడా డెంగీ మహమ్మారి బలితీసుకుంది. డెంగీ వ్యాధి బారినపడి అనేకమంది ప్రాణాలు కోల్పోతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.