Hyderabad: పోలవరం బ్యాక్ వాటర్ పై జాయింట్ సర్వేకు సీడబ్ల్యూసీ ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలపై ఆంధ్రప్రదేశ్ సర్కారు కావాలనే సర్వేను జాప్యం చేస్తోందని, సీడబ్ల్యూసీ జోక్యం చేసుకోవాలని సమావేశంలో తెలంగాణ ప్రతినిధులు పట్టుపబట్టారు.
CWC directs joint survey on Polavaram backwaters: పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై ఉమ్మడి సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల గోదావరి బ్యాక్ వాటర్ పై పడే ప్రభావాలను పరిశీలించేందుకు అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
నిర్ణీత గడువులోగా సర్వే పూర్తి చేయాలని పీపీఏకు సీడబ్ల్యూసీ అల్టిమేటం జారీ చేసింది. ఈ నెల 10న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారులతో జరిగే సమావేశంలో ఈ అంశంపై చర్చించాలని సీడబ్ల్యూసీ కోరింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక అభ్యంతరాలు ఉన్నాయంటూ తెలంగాణ, ఏపీ, ఒడిశా, చత్తీస్ గఢ్ రాష్ట్రాలు తమను ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలతో ఏకాభిప్రాయానికి ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో సమావేశమైన సీడబ్ల్యూసీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల గోదావరి బ్యాక్ వాటర్ పై పడే ప్రభావాలపై చర్చించింది. ముంపునకు గురయ్యే ప్రాంతాలపై ఉమ్మడి సర్వేకు ఓకే చెప్పింది.
పోలవరం ప్రాజెక్టు, ముంపు ప్రాంతాలు, బ్యాక్ వాటర్ వంటి అంశాలకు సంబంధించి ఆయా రాష్ట్రాల అభ్యంతరాలను సమీక్షించిన సీడబ్ల్యూసీ చైర్మన్ కుష్వీందర్ వోహ్రా వరదలపై ఇరు రాష్ట్రాలు గతంలో చేసిన అధ్యయనాలు, మ్యాపులను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు ముంపుపై ఏపీ కావాలనే సర్వేను జాప్యం చేస్తోందని, సీడబ్ల్యూసీ జోక్యం చేసుకోవాలని సమావేశంలో తెలంగాణ ప్రతినిధులు పట్టుబడుతూ.. తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా వెంటనే సర్వే నిర్వహించాలని తెలంగాణ అధికారులు సీడబ్ల్యూసీని కోరారు.
