కేంద్ర ఎన్నికల సంఘం పై ఢిల్లీ సిఎం కేజ్రివాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత నిర్ణయాన్ని తీసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులకంటే కొద్దిగా తక్కు హోదా కలిగిన పార్లమెంటరీ సెక్రటరీ పోస్టుల్లో కేజ్రీవాల్ నియమించారు. ఈ విషయమై అప్పట్లోనే కేసు కోర్టుకు వెళ్లింది. కోర్టు ఆ పదవులు చెల్లుబాటు కాదని కొట్టేసింది. అయితే దానిపై ఇప్పుడు ఎన్నికల సంఘం అనర్హత నిర్ణయం తీసుకోవడం పట్ల ఆప్ ఆగ్రహంగా ఉంది.

కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వెలువడిన తరుణంలో కేజ్రివాల్ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వేటుకు గురైన ఎమ్మెల్యేలు సైతం హాజరయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై చర్చించారు. తక్షణమే ఎన్నికల సంఘం నిర్ణయంపై కోర్టులో చాలెంజ్ చేయాలని ఆప్ నిర్ణయించింది. ఎన్నికల సంఘం నిర్ణయం వెనుక వత్తిళ్ళు పని చేశాయని ఆప్ పార్టీ భావిస్తోంది.

తమ పార్టీ వాదన వినకుండానే ఈసి ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటుందని ఆప్ ప్రశ్నిస్తోంది. పార్లమెంటరీ కార్యదర్శుల పదవులు లాభదాయక పదవుల కిందకు రావని ఆప్ అంటున్నది. ఈసి ని బిజెపి నడిపిస్తోందిన ఆప్ నేతలు ఆరోపించారు.

ఢిల్లీలో జరిగిన ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయా అని అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.