తెలంగాణ ఉద్యమ సారథిగా ప్రత్యేక రాష్ట్రం కోసం నిర్విరామంగా కృషి చేసిన కేసీఆర్ తన ఉద్యమ ప్రస్థానంలో దళితుల కోసం ఎన్నో వాగ్ధానాలు చేశారు.వైరిపక్షాలు దొర పోకడ అని విమర్శిస్తున్న వేళ దళితుడినే సీఎంను చేస్తా అంటూ వాళ్ల నోళ్లు మూయించారు.డబుల్ బెడ్ రూం ఇళ్లు, 3 ఎకరాల భూ పథకం పేరిట ఎన్నికల వేళ దళిత ఓట్ల కోసం ఎన్నో హామీలు గుప్పించారు.

 

అధికారం చేపట్టాక కూడా దళితుల కోసం ప్రత్యేక బడ్జెట్ అంటూ ఊదరగొట్టారు.

 

మూడేళ్ల పాలనలో ఈ  హామీలు, వాగ్దానాలు ఎంతవరకు వచ్చాయి...?

 

పథకాలన్నీ అమలయ్యాయా..? పక్కాగా దళితుల వరకు చేరుతున్నాయి... ?

 

అంటే అవునని చెప్పే పరిస్థితి లేదు.

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందే టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ మాట్లాడుతూ... తమ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడునే సీఎం చేస్తానన్నారు.

కానీ, అధికారం చేపట్టాక తానే సీఎం పీఠం ఎక్కారు.

డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను అవమానకర రీతిలో పదవి నుంచి తొలగించారు.

 

ఇక ఆగస్టు 15న గోల్కొండ కోట సాక్షిగా దళితులకు మూడు ఎకరాల భూమి పథకం ప్రవేశపెట్టారు.

ఇప్పటి వరకు ఈ పథకం నత్తనడకనే సాగుతోంది. తెలంగాణ జేఏసీ ఈ పథకంపై సర్వే చేసి ఆశ్చర్యకరమైన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది.

 

టీ జేఏసీ ప్రకారం.... తెలంగాణలో మొత్తం 3 లక్షల భూమిలేని దళిత కుటుంబాలున్నాయి. అంటే పంచవలసిన భూమి 9 లక్షల ఎకరాలు. 
ఇప్పటికి మొదటి మూడేళ్లలో 10016 ఎకరాల భూమి పంచింది. లబ్ది పొందిన వారు 3,728 మంది. సగటున ఏటా 1, 242 మంది.
ఈ లెక్కన మొత్తం 3 లక్షల కుటుంబాలకు 3 ఎకరాల చొప్పున పంచాలంటే 240 సంవత్సరాలు పడుతుంది.
మరో వైపు ప్రాజెక్టుల పేరుతో 3 లక్షల ఎకరాలకు పైగా భూములను రైతుల నుండి సేకరిస్తుంది. ఇందులో 70,000 ఎకరాలు అస్సైండ్ భూములే. ఇందులో 70% దళితులకు నుండి గుంజుకున్నవే. 

అంటే ఈ మూడేళ్లలో దళితునికి ఇచ్చిన 1 ఎకరా భూమికి, 5 ఎకరాల భూమి దళితుల నుండి గుంజుకుంది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితులకు మూడు ఎకరాలపై టీజేఏసీ చెబుతున్న వివరాలు ఇవి.

 

ఇదంతా గమనిస్తే ఈ పథకమూ పక్కదారి పట్టిందని ఇట్టే అర్ధమవుతోంది.

 

ఈ పథకం దళితుల అభ్యున్నతి, సాధికారతకా లేక వారికి ఉన్న భూమిని కూడా దౌర్జన్యంగా లాక్కోడానికా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

 

ఇక దళితులకు కేజీ టూ పీజీ కోసం ప్రత్యేకంగా గురుకులాల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, దీని కోసం బడ్జెట్ లో కనీస మొత్తం కూడా కేటాయింపులు జరపలేదు.

దళితులకు కోసం ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ పేరిట ప్రత్యేక బడ్జెట్ కేటాయించారు. అయితే ఇప్పటి వరకు ఆ నిధులు ఖర్చుపెట్టడానికి చేతులు రావడం లేదు.

 

ఇలా చెప్పుకుంటూ పోతే దళిత మాటున సీఎం మాట తప్పిన అంశాలు చాలానే ఉన్నాయని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.