Asianet News TeluguAsianet News Telugu

జర్నలిస్టులపైనా కస్సుమన్న కేసిఆర్

  • ప్రతిపక్ష పార్టీల మాటలు రాయడంపై అసహనం
  • సోషల్ మీడియాలో అడ్డగోలుగా రాయిస్తున్నారు
  • ఎవరినీ వదిలే ప్రశ్నే లేదు
  • ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టులను ఏనాడూ పట్టించుకోలేదు
  • మేమే అంతో ఇంతో జర్నలిస్టులకు ఉపశమనం చేస్తున్నం
KCR turns anger towards journos as well

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు ఉంది ఈ ముచ్చట. తెలంగాణలో ప్రతిపక్షాల వాయిస్ ను కానీ, అధికార పక్షం వాయిస్ కానీ జనాలకు చేరవేయడం పత్రికలు, టివిల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల ధర్మం. కానీ ఎందుకో ఏమో కానీ తెలంగాణ సిఎం కేసిఆర్ కు మీడియా జర్నలిస్టుల మీద బాగ కోపమొచ్చింది.

తెలంగాణ సిఎం కేసిఆర్ ప్రగతిభవన్ లో ప్రెస్ మీట్ పెట్టిర్రు. సింగరేణిలో టిఆర్ఎస్ సంఘం గెలిచినందుకు సంతోషంగా మాట్లాడుతూనే విపక్షాలను గట్టిగా భూతు భాషలో తిట్టు అందుకున్నరు. అందరికంటే ఎక్కువగా జెఎసి ఛైర్మన్  కోదండరాం ను బాగ టార్గెట్ చేసిర్రు. కోదండరాంను వాడు, వీడు, లంగ అంటూ బూతు భాషలో తిట్ల దండకం అందుకున్నారు.

ఇదంతా బాగానే ఉన్నా మధ్యలో జర్నలిస్టులను కూడా సుతిమెత్తగా హెచ్చరిక లాంటి బెదిరింపులకు దిగిండు సిఎం. తెలంగాణలో సర్కారు మొదలు పెట్టిన రైతు సమన్వయ సమితి ఏర్పాటు విషయంలో విపక్షాలు సర్కారును గట్టిగానే విమర్శిస్తున్నాయి. అన్ని ప్రతిపక్ష పార్టీలు సర్కారు తీరును ఎండగడుతున్నాయి. ఈ విషయంలో సర్కార్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించాయి. విపక్షాలు లేవనెత్తిన అంశాలను మీడియా కథనాలు రాసింది. వాళ్లు మాట్లాడిన మాటలను రాసినందుకే సిఎంకు కోపమొచ్చినట్లుంది.

వాళ్లు ఏది పడితే అది రాస్తరా? మీరు కొంచెం ఆలోచించొద్దా? వాళ్లు బుద్ధి లేకుండా మాట్లాడుతుంటే వాటిని ఎలా రాస్తారు? అంటూ ప్రశ్నించారు. అలా మాట్లాడినోళ్లను అక్కడే నిలదీయాలి కదా? ఇవేం బుద్ధిలేని మాటలు అని. మీరు అలా రాయడం సరికాదు అని సున్నితంగానే హెచ్చరించారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ  జర్నలిస్టుల సంక్షేమం గురించి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ మేము అద్భుతంగా కాకపోయినా ఎంతో కొంత ఉపశమనం చేస్తున్నాం. 50 కోట్లు ఇచ్చినం జర్నలిస్టులకు.

సోషల్ మీడియాలో అడ్డగోలుగా రాతలు రాస్తున్నరు. వాళ్లను వదిలి పెట్టే ప్రసక్తే లేదు. సోషల్ మీడియా రాతల వెనుక ఎవరున్నా వదలబోం. నేను దొర అని ఒకడు రాస్తడు. హైదరాబాద్ డల్లాస్ అయిపోయిందని ఇంకోడు రాస్తడు. సిఎం ను పట్టుకుని, మంత్రులను పట్టుకుని, ప్రజా ప్రతినిధులను పట్టుకుని ఇంత నీచంగా రాస్తరా?

సోషల్ మీడియాలో? అని ప్రశ్నించారు కేసిఆర్. రకరకాల సంస్థలు పెట్టి సోషల్ మీడియాలో నలుగురైదుగురు పోరగాళ్లను పెట్టి రాపిస్తున్నరు అని అసహనం వ్యక్తం చేశారు.

ఒకవైపు తెలంగాణలో మీడియాలో ప్రతిపక్షాల వాయిస్ లేకుండాపోయిందన్న విమర్శలున్న కాలంలో సిఎం కేసిఆర్ జర్నలిస్టులు ప్రతిపక్షాలు ఏది చెబితే అదే రాయడం సరికాదంటూ కామెంట్ చేయడం మీడియా వర్గాల్లో చర్చనీయాంశమైంది.

కొసమెరుపు ఏమంటే... గతంలో కేసిఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సిఎంగా రాజశేఖరరెడ్డి ఉన్నారు. అప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పది మంది తిరుగుబాటు చేసి కాంగ్రెస్ తో కలిశారు. ఆ సమయంలో కేసిఆర్ వైఎస్ మీద విరుచుకుపడ్డారు. పార్టీ పిరాయించిపిస్తావయా? ఇదేనా దిక్కుమాలిన రాజకీయం.. అయినా జర్నలిస్టులు ఇదేం పని అని దౌడ పలగ్గొట్టి అడగొద్దు వైఎస్ ను అంటూ జర్నలిస్టులకు చురకలు వేశారు. మల్లా ఇప్పుడు కూడా జర్నలిస్టులకు చురకలేయడం గమనార్హం.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/yhm1Ku

 

 

Follow Us:
Download App:
  • android
  • ios