నోట్ల రద్దు అయిన రాత్రి కెసిఆర్ గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ వద్దకు వెళ్లి మోడి నిర్ణయంపై విరుచుకుపడిన సంగతి అందరికీ తెలిసిందే.

కేంద్రంపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఈగ కూడా వాలనివ్వటంలేదు. శుక్రవారం తెలంగాణా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. మొదటి రోజే సభలో నోట్ల రద్దు, తదనంతర పరిణామాలపై చర్చ మొదలైంది. మొదట సభా నాయకుని హోదాలో ముఖ్యమంత్రి ఓ ప్రకటన చేసారు.

తర్వాత ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్ తరపున జానారెడ్డి మాట్లాడారు. అయితే, జానారెడ్డి నోట్ల రద్దుపై ప్రసంగం మొదలుపెట్టగానే వెంటనే కెసిఆర్ జోక్యం చేసుకున్నారు. నోట్ల రద్దు అన్నది కేంద్రం తీసుకున్న విధానపరమైన నిర్ణయం కాబట్టి సదరు నిర్ణయంపై ఇక్కడ మాట్లాడకూడదంటూ అభ్యంతరం వ్యక్తం చేసారు.

ఆ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి మాత్రమే సభలో చర్చ జరగాలంటూ పదే పదే జానారెడ్డి ప్రసంగానికి కెసిఆర్ అడ్డుపడటం ఆశ్చర్యం.

అదేవిధంగా ఏఐఎంఐఎం నేత అక్బరుద్దీన్ ప్రసంగం మొదలుపెట్టగానే మళ్లీ కెసిఆర్ అడ్డుకున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంలోని మంచి చెడ్డలపై ఇక్కడ చర్చ వద్దన్నారు. రాష్ట్రంపై దాని ప్రభావం గురించి మాత్రమే చర్చ జరగాలంటూ కెసిఆర్ పదేపదే చెప్పటం గమనార్హం.

నోట్ల రద్దు అయిన రాత్రి కెసిఆర్ గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ వద్దకు వెళ్లి మోడి నిర్ణయంపై విరుచుకుపడిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రధాని తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర ఆదాయాలన్నీ పడిపోతాయంటూ ధ్వజమెత్తారు. అయితే, రాత్రికి రాత్రి ఏమి జరిగిందో ఎవరికీ తెలీదు గానీ మరుసటి రోజునుండి నోట్ల రద్దుపై కెసిఆర్ నోరు మెదపలేదు.

తరువాత, ఢిల్లీకి వెళ్లి ప్రధానితొ భేటీ కూడా అయ్యారు. ఆ తర్వాత నుండి నోట్ల రద్దుకు అనుకూలంగా కెసిఆర్ కొత్త పల్లవి అందుకున్నారు. దాంతో అందరూ విస్తుపోతున్నారు. తాజాగా మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర నిర్ణయంపై ప్రతిపక్షాల నుండి ఒక్క మాట కూడా రానీకుండా కాపు కాస్తుండటం పలువురిని ఆశ్చర్యపరుస్తున్నది.