Asianet News TeluguAsianet News Telugu

బక్కపలుచ ప్రాణమే... దేశంలో భూకంపం పుట్టిస్తా: కేసీఆర్

తాను తెలంగాణను వదిలివెళ్లనని, హైదరాబాదు నుంచే దేశంలో భూకంపం పుట్టిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనపై అన్నారు. 

KCR says he will change India

హైదరాబాద్: తాను తెలంగాణను వదిలివెళ్లనని, హైదరాబాదు నుంచే దేశంలో భూకంపం పుట్టిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనపై అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి తాను తమాషాగా, ఆషామాషిగా చెప్పడం లేదని అన్నారు.

తనది బక్కపలుచ ప్రాణమైనా దేశానికి మేలు జరగాలనే ఆలోచన ఉందని, అది మొండి ఆలోచన అని, ఆ ఆలోచనతోనే ఫెడరల్ ఫ్రంట్ ప్రకటన చేశానని, అది ప్రకటన కాదనీ.. ఓ సంచలనమని అన్నారు. శుక్రవారం టిఆర్ఎస్ ప్లీనరీలో ఆయన దేశ రాజకీయాల్లో తాను పోషించబోయే పాత్రపై సుదీర్ఘంగా మాట్లాడారు. కాంగ్రెసు, బిజెపిలపై తీవ్రమైన విమర్శలు చేశారు.

ఓ బక్క ప్రాణం తెలంగాణ నుంచి ప్రకటన చేస్తే దద్ధరిల్లిపోయి రాహుల్ గాంధీ మాట్లాడారని, కేసీఆర్ మోడీ ఏజెంట్ అని వ్యాఖ్యానించారని అంటూ దేశం గురించి బిజెపి, కాంగ్రెసు పార్టీలు మాత్రమే మాట్లాడాలా, ఎవరూ మాట్లాడకూడదా అని ఆయన అన్నారు. 

తెలంగాణ ఏమంటుందో భారతదేశానికి అంతటికీ తెలియాలని అన్నారు. ఫ్రంట్ కు టెంట్ లేదని బిజెపి నాయకులు అంటున్నారని, అయితే తాను మొండిని కదా... కెసిఆర్ అంటే భయపడి అలా అంటున్నారని అన్నారు. కేసీఆర్ ఓ మాట అంటే వెనక్కి తిరిగి చూడడని భయపడి బిజెపి నాయకులు ఆ రకంగా అన్నారని కేసిఆర్ అభిప్రాయపడ్డారు.

ఈ దేశంలో పుట్టాం కాబట్టి ఈ దేశం బాగుపడాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. సర్వశక్తులూ ఒడ్డి దేశానికి దారి చూపడానికి పోరాటం చేస్తానని, తెలంగాణ గౌరవం పెంచుతానని అన్నారు. ఆకాశాన్ని భూమిని ఒక్కటి చేసైనా, ఆరునూరైనా సరే భగవంతుడిచ్చిన సర్వసక్తులూ ఒడ్డి దేశానికి దారి చూపిస్తానని అన్నారు. మడమ తిప్పే అవసరం లేదని అన్నారు. 

దేశాన్ని కాంగ్రెసు 55 ఏళ్లు, బిజెపి 11 ఏళ్లు పాలించాయని, మిగతా ఆరేళ్లు ఇతరులు పాలించారని, వారిని బిజెపీ కాంగ్రెసులు పనిచేయనీయలేదని అన్నారు. అది దేశానికి మంచిది కాదని అన్నారు. 

కావేరి నీళ్లపై కాంగ్రెసు, బిజెపిలు డ్రామాలు ఆడుతున్నాయని, కావేరీ జలాల గురించి 2014 నుంచే మాట్లాడవచ్చు కదా అని అన్నారు. నీటి యుద్ధాలు జరుగుతాయని అంటున్నారని, వారి చేతగాని పాలన వల్లే ఆ స్థితి వచ్చిందని అన్నారు. దేశంలో జీవనదులు చాలా ఉన్నాయని, మిగులు జలాలు మిక్కిలిగా ఉన్నాయని, వాటిని వాడుకునే పనులు ప్రభుత్వాలు చేయలేదని అన్నారు. 

పర్యాటక రంగాన్ని ఏ విధంగా కాంగ్రెసు, బిజెపి ప్రభుత్వాలు ఏ విధంగా నిర్లక్ష్యం చేశాయో ఆయన వివరించారు. మన ద్వీపాలను పర్యాకట కేంద్రాలుగా అభివృద్ధి చేయకుండా సన్నాసుల్లా మిగిలిపోయామని అన్నారు. చిన్నపాటి సముద్ర తీరాలు ఉన్న సిగంపూర్, చైనా వంటి దేశాలు హ్యాండిల్ చేస్తున్న కంటైనర్ల వివరాలు చెబతూ మనదేశానికి 7500 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నా కూడా మన కంటైనర్లు 87 లక్షలు మాత్రమేనని అన్నారు. ఈ నాయకత్వాన్ని నమ్ముకుంటే ఈ దేశం బాగపడుతుందా ఆయన అడిగారు. 

దేశాన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా గరీబీ హాటావో వంటి ఫాల్త్ హామీలు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. చైనా సాధించిన అభివృద్ధిని భారతదేశం వెనకబడిన స్థితిని ఆయన లెక్కలతో సహా వివరించారు.  చైనా పురోగమిస్తుంటే, మనం ఏం చేయకూడదో అది చేస్తున్నామని అన్నారు. 

వ్యవసాయం, ఆరోగ్యం, రోడ్లు వంటి రంగాలపై కేంద్రం పెత్తనం ఎందుకని అడిగారు. పంచాయతీ కూడా రోడ్లు వేస్తుందని, దానిపై కేంద్రం ఆధిపత్యం ఎందుకని అడిగారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే వీరేంద్ర బ్రహ్మచారి, చంద్రస్వామి ఉంటారని, బిజెపి అధికారంలో ఉంటే నీరవ్ మోడీ, లలిత్ మోడీలని... వారిని చూసి మనం డబ్బాలు కొట్టాలని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఇకపై అవి సాగవని అన్నారు. 

మీకు అధికారంలేదు మేమే మాట్లాడాలనే విధంగా కాంగ్రెసు, బిజెపిలు వ్యవహరిస్తున్నాయని అన్నారు.  తనకు అధికారం, తెలివితేటలు, చతురత ఉన్నాయని, దేశమంతా తిరిగి ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి దేశంలో గుణాత్మక మార్పునకు కృషి చేస్తానని చెప్పారు. 

బిజెపి ఓడిపోతే కాంగ్రెసు వస్తుందని, అలా జరిగితే స్కామ్ ల పద్ధతి మారుతుంది గానీ ప్రజల తలరాతలు మారుతాయా అని అన్నారు. దానికి రెండు జాతీయ పార్టీల అధ్యక్షులు సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. త్వరలోనే స్టాలిన్, అఖిలేష్ యాదవ్ వస్తున్నారని చెప్పారు. 

దేశ రాజకీయాల్లో క్రియాశీలమైన, ప్రభావశీలమైన పాత్ర పోషిస్తామని, భారత ఆత్మగౌరవ బావుటా ఎగరేయడానికి ముందుకు సాగుతానని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios