Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెసు దిగ్గజాలకు ఎసరు: కేసిఆర్ వ్యూహం ఇదీ...

కాంగ్రెసు పార్టీలోని దిగ్గజాలకు షాక్ ఇవ్వడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పక్కా ప్లాన్ వేసినట్లు చెబుతున్నారు. 

KCR plans to defeat top Congress leaders

హైదరాబాద్: కాంగ్రెసు పార్టీలోని దిగ్గజాలకు షాక్ ఇవ్వడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పక్కా ప్లాన్ వేసినట్లు చెబుతున్నారు. సిఎల్పీ నేత కె. జనారెడ్డి, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతికి ధీటుగా పోటీ ఇవ్వగల అభ్యర్థులను ఇప్పటికే ఆయన గుర్తించినట్లు చెబుతున్నారు. 

తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెసులో చేరిన రేవంత్ రెడ్డికి, టీపీసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలనే లక్ష్యంతో ఆయన ప్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో కాసోజు శంకరమ్మపై 24 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయనపై ఎన్నారై శానంపూడి సైదిరెడ్డిని పోటీకి దించాలని కేసిఆర్ భావిస్తున్నారు. ఇటీవలే ఆయన టీఆర్ఎస్ లో చేరారు. 

సిఎల్పీ నేత కె. జనారెడ్డి నాగార్జునసాగర్ సీటు నుంచి 16,457 ఓట్ల తేడాతో నోముల నర్సింహయ్యపై విజయం సాధించారు. తిరిగి నోముల నర్సింహయ్యకే టికెట్ దక్కే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం బలంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకునే కేసిఆర్ కీలకమైన అడుగు వేశారు. 1994 ఎన్నికల్లో పాత చలకుర్తి నియోజకవర్గంలో జానారెడ్డిని జి. రామ్మూర్తి యాదవ్ ఓడించారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని రామ్మూర్తి యాదవ్ అల్లుడు బడుగుల లింగయ్య యాదవ్ ను రాజ్యసభకు పంపించారు. తద్వారా బడుగుల లింగయ్య యాదవ్ నోముల నర్సింహయ్య విజయానికి పూర్తి స్థాయిలో సహకరిస్తారనేది కేసీఆర్ ఆలోచన. 

కోదాడ నియోజకవర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతిపై శశిధర్ రెడ్డిని పోటీకి దించాలనే ఆలోచన చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డిపై రవాణ శాఖ మంత్రి పి. మహేందర్ రెడ్డి సోదరుడు పి. నరేందర్ రెడ్డిని పోటీకి దించుతారని అంటున్నారు .

మథిర నియోజకవర్గంలో మల్లు భట్టి విక్రమార్కపై పోటీకి దించాల్సిన అభ్యర్థి కోసం కేసిఆర్ అన్వేషణ సాగిస్తున్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మోత్కుపల్లి నర్సింహులును పార్టీలోకి తీసుకుని మథిర టికెట్ ఇచ్చే ఆలోచన కూడా లేకపోలేదని అంటున్నారు.

ఇటీవలే తమ పార్టీలో చేరిన నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెసు అధిష్టానం నాగర్ కర్నూల్ టికెట్ ఇస్తే ఎమ్మెల్సీ కె. దామోదర్ రెడ్డిని పోటీకి దించాలని కేసిఆర్ ఆలోచన చేస్తున్నారు. మొత్తం మీద, కేసిఆర్ కాంగ్రెసు రాష్ట్ర దిగ్గజాలను ఓడించడానికి పక్కా ప్లాన్ రచించినట్లు తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios