అగ్ర కులానికి చెందిన రాజీవ్ శర్మ పదవీకాలాన్ని రెండుస్లారు పొడగించిన సీఎం కేసీఆర్... ప్రదీప్ చంద్ర విషయంలో మాత్రం మౌనంగా ఉండడం గమనార్హం. అందుకే సీఎం తనను రనౌట్ చేశాడని తాజా మాజీ సీఎస్ పరోక్షంగా వ్యాఖ్యానించారు.
తెలంగాణ లో క్రికెటర్లు లేరని ఇంకేం బాధపడకండి. రాష్ట్రమంతా కేసీఆర్ ను ఉద్యమనేతగా, సీఎంగా చూస్తుంటే ఆయనలోని గొప్ప క్రికెటర్ ను మాత్రం తాజా మాజీ ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర గుర్తించారు.
కేసీఆర్ తనను రనౌట్ చేశాడని పరోక్షంగా తన మనసులోని మాటను భయటపెట్టాడు. ఇంతకీ ఏంటీ ఆయన మనసులోని మాట..
తెలంగాణ తొలి ప్రభుత్వ ప్రదాన కార్యదర్శిగా పదవీబాధ్యతలు చేపట్టిన రాజీవ్ శర్మ ఇటీవల పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఆయన పదవీ కాలాన్ని సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి మరీ రెండు సార్లు పొడిగించారు. తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన రిటైరవ్వాల్సి వచ్చింది. తర్వాత ఆయనను ప్రభుత్వం సీఎం సలహాదారుడిగా నియమించడం విశేషం.
తర్వాత ఆయన స్థానంలో సీనియారిటీ ప్రకారం కొద్ది రోజుల కిందటే సీఎస్ గా ప్రదీప్ చంద్ర నియమితులయ్యారు.
అయితే, రాజీవ్ శర్మ పదవీ కాలాన్ని సీఎం ఢిల్లీకి వెళ్లి మరి రెండుసార్లు పొడగిస్తే... ప్రదీప్ చంద్రకు ఆ అవకాశం దక్కలేదు. దీనిపై సీఎం గట్టిగా ప్రయత్నించలేదని
సమాచారం.
దీనిని దృష్టిలో పెట్టుకొనే పై వ్యాఖ్యలను ప్రదీప్ చంద్ర చేసినట్లు తెలుస్తోంది.
తన పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం వేదికగా ప్రదీప్ చంద్ర తన ఆవేదనను వెళ్లగక్కారు.
తాను వన్ డౌన్ బ్యాట్స్ మెన్ గా వచ్చానని మధ్యలోనే రనౌట్ అయి వెళ్లిపోతున్నానని వ్యాఖ్యానించారు. ‘నాకు లెక్కలు రావని సీఎంకు ఎవరో చెప్పారు. కానీ, ఆర్థికశాఖలో చాలా మార్పులు చేశా. టీఎస్ ఐ పాస్ ను తీసుకరావడంలో దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్నాం‘ అని అన్నారు.
అంతేకాదు... అణగారిన వర్గాలకు గుర్తింపు లేకుండా చేస్తున్నారన్న అపవాద రాకుండా తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్త పడాలని సూచించి తన ప్రసంగాన్ని ముగించారు.
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఐటీ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, రాజీవ్ శర్మ పదవీ విరమణ కార్యక్రమాన్ని దగ్గరుండి భారీ స్థాయిలో జరిపించిన సీఎం కేసీఆర్... ప్రదీప్ చంద్ర కార్యక్రమానికి డుమ్మా కొట్టడం గమనార్హం.
