బాల్య మిత్రుడిని ఫిదా చేసిన కేసిఆర్

KCR makes his childhood friend happy
Highlights

ఇంట్రెస్టింగ్ మ్యాటర్

తన బాల్యమిత్రుడిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫిదా చేశారు. ఆశించిన పదవికన్నా పెద్ద పదవినే స్నేహితుడికి కట్టబెట్టారు. కలలో కూడా ఊహించని పదవి తనను వరించడంతో ఆ బాల్య మిత్రుడి ఆనందానికి హద్దులు లేకుండాపోయింది. మెదక్‌ జిల్లా దుబ్బాక మండలం చెల్లాపూర్‌ గ్రామానికి చెందిన బొమ్మెర వెంకటేశం, కేసిఆర్ ఇద్దరూ బాల్య స్నేహితులు. ఒకటి నుంచి ఐదో తరగతి దాకా ఇద్దరూ దుబ్బాకలో కలిసి చదువుకున్నారు. 

బొమ్మెర చిరువ్యాపారస్తుడే అయినా.. ఆయనతో సాన్నిహిత్యాన్ని సీఎం కేసీఆర్‌ వీడలేదు. ఎప్పుడైనా తనను నేరుగా కలిసే స్వేచ్ఛను ఆయనకు కల్పించారు. తనను కలిసినప్పుడల్లా ‘నీకేం పదవి కావాలిరా’ అంటూ బొమ్మెరను అడిగేవారు. ఎప్పుడూ పదవుల ఊసెత్తని బొమ్మెర.. తనకు ఏదైనా దేవాలయంలో డైరెక్టర్‌ పదవిని ఇస్తే భగవంతుడి సేవలో తరిస్తానని సీఎంతో అంటుండేవారు. అయితే.. ఆశించిన దానికంటే తన స్నేహితుడికి సీఎం కేసీఆర్‌ గొప్ప పదవినే కట్టబెట్టారు బొమ్మెరకు భూపాలపల్లి జిల్లా మంథని నియోజక వర్గ పరిధిలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ చైర్మన్‌గా నామినేట్‌ పదవి వరించింది. తనకు డైరెక్టర్‌గా నామినేట్‌ చేశారని మాత్రమే బొమ్మెరకు తెలుసు. కానీ..మంగళవారం ఉదయం పత్రికలో వచ్చిన వార్తను చూసి బొమ్మెర ఆశ్చర్యపోయారు. మంత్రి టి.హరీశ్‌రావును కలిసి నియామక పత్రాన్ని అందుకున్నారు.

 ఆలయ చైర్మన్‌గా బొమ్మెర ఎన్నికయ్యేలా చూడాలని సోమవారం సీఎం కేసీఆర్‌ నుంచి హరీశ్‌రావుకు ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మంథని ఎమ్మెల్యే పుట్ట మధును హరీశ్‌ ఆదేశించారు. దీంతో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి దాకా పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఆలయ చైర్మన్‌గా బొమ్మెర ఏకగీవ్రంగా ఎన్నికైనట్టు పత్రిక ప్రకటనను కూడా విడుదల చేశామని హరీశ్‌కు మధు వివరించారు. తనకు పదవి కట్టబెట్టినందుకు మంత్రి హరీశ్‌కు బొమ్మెర కృతజ్ఞతలు చెప్పారు. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

loader