హైదరాబాద్: ఉద్యోగ సంఘాలతో తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కలిసి కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు.

ఉద్యోగ సంఘాల డైరీ, క్యాలెండర్లను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. వేతన సవరణ, ఉద్యోగ విరమణ వయస్సు పెంపు, సర్వీసు నిబంధనలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ చర్చించారు.

ఉద్యోగులకు వేతనాలను పెంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. అన్ని స్థాయిల ఉద్యోగులకు వేతనాలను పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిట్‌మెంట్ పైనే ప్రధానంగా ఉద్యోగ సంఘాలు పట్టుబట్టే అవకాశం లేకపోలేదు.

పీఆర్‌సీపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ గడువు ఇవాల్టితో ముగియనుంది. వచ్చే వారంలో కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశం లేకపోలేదు. 2018 జూన్ నుండి కొత్త పీఆర్‌సీని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, కరోనా ప్రభావం నేపథ్యంలో సీఎం ఉద్యోగ సంఘాలకు ఏం చెబుతారనేది ఆసక్తిగా మారింది.

పీఆర్సీని వెంటనే అమలు చేయలేకపోతే మధ్యంతర భృతిని ఇవ్వాలని కూడ ఉద్యోగ సంఘాలు సీఎం ముందు ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలపై సీఎం  నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సీఎంతో జరిగిన సమావేశంలో టీఎన్జీవో, టీజీవో, ట్రెసాతో పాటు నాలుగవ తరగతి ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.