DK Aruna: కేసీఆర్ ఒక 'ఝూటాకోర్'.. సిగ్గుండాలంటూ సీఎంపై డీకే అరుణ ఫైర్
Hyderabad: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) చీఫ్, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ను టార్గెట్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ ఒక ఝూటాకోర్ అనీ, అబద్దపు మాటలు చెప్పడంలో ఆయనను మించినవాళ్లు లేరని విమర్శించారు.
DK Aruna lashes out at CM KCR : 'పాలమూరు ప్రాంత ప్రజలను, రైతులను నిరాశలోకి నెట్టిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అబద్ధాలకోరు, మోసగాడు' అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. సీఎం కేసీఆర్ ఒక ఝూటాకోర్ అనీ, అబద్దపు మాటలు చెప్పడంలో ఆయనను మించినవాళ్లు లేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన అనంతరం కొల్లాపూర్ లో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో అర్థరాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీకే అరుణ మాట్లాడుతూ.. రీడిజైన్ చేసిన ప్రాజెక్టు నుంచి కమీషన్లు పొందేందుకు పీఆర్ ఎల్ ఐఎస్ డిజైన్లను మార్చింది మీరే కేసీఆర్ అని విమర్శించారు. "కృష్ణా జలాల్లో 299 టీఎంసిల వాటాకు అంగీకరిస్తూ ఢిల్లీలో కేంద్రం ఏర్పాటు చేసిన సమావేశంలో మీరు సంతకం చేశారు, వాస్తవానికి మన వాటా 566 టీఎంసీలు. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణకు రావాల్సిన నదీ జలాలను వాడుకునేలా ఏపీ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చారని మండిపడ్డారు. ఇప్పుడు మోసగాడు ఎవరు?" అని ప్రశ్నించారు.
ఏపీకి 512 టీఎంసీల వాటా వచ్చిందని, నేడు 648 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకుంటున్నారని అన్నారు. సంతకం ప్రకారం కాకుండా ఏపీ 640 టీఎంసీలు తీసుకుపోతోందనీ, దీనిని అడ్డుకోవడానికి ఏం చేస్తున్నారని కేసీఆర్ ను ప్రశ్నించారు. "మన వాటా నీటిని తీసుకుపోతుంటే వారిని ఎందుకు ఆపలేకపోతున్నారు? పాలమూరుకు వచ్చి తుర్రంఖాన్ లా నటించి ఏం చెప్పదలుచుకున్నారు. మీకు సిగ్గు ఉండాలి.. 31 పంపుల్లో ఒకదాన్ని ఆన్ చేయడం ద్వారా పీఆర్ఎల్ఐఎస్ ప్రారంభించబడిందని మీరు ఎందుకు చెబుతున్నారో.. కాలువ పనులకు టెండర్లు కూడా పిలవలేదు. పీఆర్ఎల్ఐఎస్ ఏ విధంగా సిద్ధంగా ఉంది?" అని ప్రశ్నించారు.
కేసీఆర్ కు సిగ్గుంటే పీఆర్ ఎల్ ఐఎస్ హోదాపై శ్వేతపత్రం విడుదల చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. "పాలమూరులోని వివిధ సాగునీటి ప్రాజెక్టుల కోసం పోరాడింది నేనే. కేసీఆర్ అబద్ధాలు చెప్పడం తప్ప మరేమీ చేయలేదు.. ఈ ప్రాంత ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నందున అక్కడికి వెళ్లారని" డీకే ఆరుణ మండిపడ్డారు.