తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనాారోగ్యంతో యశోద హాస్పిటల్లో చేరారు. ఆయన పరిస్థితిపై ప్రస్తుత సీఎం రేవంత్ ఆరా తీశారు. ఇంతకూ కేసీఆర్ కు ఏమయ్యిందంటే.. 

Kalvakuntla Chandrashekar Rao : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యాయి. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కేసీఆర్ ను కుటుంబసభ్యులు సోమాజిగూడలోని యశోద హాస్పిటల్ కు తరలించారు. ఆయనను వైద్యుల బృందం పరీక్షించి వివిధ టెస్టులు చేశారు.

అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్ వైద్యం కోసం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి హైదరాబాద్ కు వచ్చారు. ఆయన వెంట భార్య శోభ, కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు కూడా హాస్పిటల్ కు వెళ్లారు. అయితే ఇది సాధారణ సీజనల్ జ్వరమేనని... భయపడాల్సిన పనేమి లేదని వైద్యులు తెలిపినట్లు సమాచారం.

అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్ రెండుమూడురోజులు హైదరాబాద్ లోనే ఉండనున్నారు. జ్వరం నయమయ్యాకే తిరిగి ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు. అయితే ఆయనకు టెస్టులు చేసి ఇంటికి పంపిస్తారా లేక హాస్పిటల్లోనే చేర్చుకుంటారా? అన్నది తెలియాల్సి ఉంది. బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కంగారుపడకుండా కేసీఆర్ హెల్త్ బులెటిన్ ను విడుదల చేయనున్నారు.

ఇక కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. యశోద హాస్పిటల్ వైద్యులు, అధికారులతో మాట్లాడిన కేసీఆర్ అనారోగ్యం గురించి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని... సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాక్షిస్తున్నట్లు రేవంత్‌ రెడ్డి తెలిపారు.