హైదరాబాద్:  రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండొద్దనే ధరణి పోర్టల్ ను తీసుకొచ్చినట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.గురువారం నాడు ప్రగతి భవన్ లో ధరణి పోర్టల్ సేవలు, భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్ ఇవాళ సమీక్ష నిర్వహించారు.

ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలను  సాధిస్తోందని ఆయన చెప్పారు. పైరవీలు లేకుండా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పెరుగుతున్నాయన్నారు.2 నెలల్లో లక్షా 6 వేల మంది ధరణి ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకొన్నారని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే 80 వేల మంది రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకొన్నారని చెప్పారు. 

వ్యవసాయ భూముల సమస్యల్ని 2 నెలల్లో పరిష్కారించనున్నట్టుగా ఆయన తెలిపారు. ధరణి పోర్టల్ ను మరింత మెరుగుపరుస్తామన్నారు.సాదా బైనామాల యాజమాన్య హక్కులు ఖరారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

ధరఖాస్తులను పరిశీలించి ధరణిలో నమోదు  చేయాలని ఆయన సూచించారు. రెవిన్యూ కోర్టుల్లో వివాదాల పరిష్కారానికి కలెక్టర్ల ఆధ్వర్యంలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

1/70 భూముల్లో ఎస్టీ హక్కులను కాపాడేలా చర్యలు తీసుకొంటామని ఆయన హామీ ఇచ్చారు.ధరణి పోర్టల్ ద్వారా లీజ్ అగ్రిమెంట్ల రిజిస్ట్రేషన్లకు వెసులుబాటును కల్పించామన్నారు. వ్యవసాయ భూముల క్రయ విక్రయాలకు ధరణిలో అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు.