KCR Health Update: తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అస్వస్థతతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన మధ్య యశోద ఆస్పత్రి కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
KCR Health Update: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింతగా విషమించడంతో కుటుంబ సభ్యులు అత్యవసరంగా ఆయనను హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు.
ముందుగా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ నుంచి నందినగర్ నివాసానికి తరలించారు. అక్కడి నుంచి వైద్య సాయం కోసం హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువచ్చారు.
వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల
యశోద ఆసుపత్రికి చేరిన వెంటనే వైద్యుల బృందం కేసీఆర్‌ను పలు పరీక్షలు చేసింది. తాజాగా యశోద ఆస్పత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దాని ప్రకారం, కేసీఆర్‌కు తీవ్రమైన జ్వరం ఉండగా, రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా పెరిగినట్లు, సోడియం స్థాయిలు తీవ్రమైనంగా తగ్గినట్లు వైద్యులు గుర్తించారు. అయితే ఇతర ప్రాథమిక పరీక్షల్లో ఎలాంటి పెద్ద సమస్యలు లేనట్లు సమాచారం.
ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నప్పటికీ, వైద్యులు అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ, అవసరమైన చికిత్స అందిస్తున్నారని స్పష్టంచేశారు. కేసీఆర్‌ను ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన
కేసీఆర్ ఆరోగ్య సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ఆయన యశోద ఆసుపత్రి అధికారులతో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నారు. కేసీఆర్‌కు అత్యుత్తమ వైద్యం అందించాలన్నారు. అలాగే, “అనారోగ్యం పాలైన కేసీఆర్ త్వరగా కోలుకోవాలి” అని ఆకాంక్షించారు.
బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన
బీఆర్ఎస్ శ్రేణుల్లో కేసీఆర్ అనారోగ్యం వార్త కలకలం రేపింది. పార్టీకి మార్గదర్శకునిగా ఉన్న కేసీఆర్ అస్వస్థత వార్త తెలియగానే పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు సోమాజిగూడ యశోద ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఆసుపత్రిని సందర్శిస్తున్నారు. మాజీ మంత్రులు, కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడు సంతోష్ కుమార్ తదితరులు కేసీఆర్ వెంట ఉన్నారు.