ఓవైపు సినిమాలు...మరోవైపు రాజకీయాలను విజయవంతంగా ఏకకాలంలో కొనసాగిస్తున్న ప్రముఖ నటి - తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి తాజాగా ఆసక్తికర కామెంట్లతో తెరమీదకు వచ్చారు. 

తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండవ సారి పగ్గాలు చేపట్టిన టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్..మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న తరుణంలో...విజయశాంతి ఓ ఆసక్తికర రివ్యూ చేశారు  

టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది పాలనపై కాంగ్రెస్ నేత విజయశాంతి నిప్పులు చెరిగారు. కేసీఆర్ పాలన గురించి చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆర్థికంగా చాలా బలిమితో ఉందని తన ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా విజయశాంతి విమర్శించారు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబం అంతకన్నా ఎక్కువ కలిమితో ఉన్నారని తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారని చెప్పారు. 

మిగులు బడ్జెట్‌తో మొదలైన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. సిరి సంపదలతో తులతూగే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఖర్చులు తగ్గించుకుని పొదుపుగా డబ్బుల్ని వాడాలని సీఎం కేసీఆర్ సూచించే స్థాయికి దిగజార్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఆమె ఎద్దేవా చేసారు.  

Also read: నిజామాబాద్ జిల్లా రైతులకు ఝలక్: అంతకు మించి అంటున్న ఎంపీ అరవింద్

ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఖర్చులను తగ్గించుకోవాలని సూచిస్తున్న కేసీఆర్, సీఎంగా తాను చేస్తున్న దుబారా ఖర్చులను ఏ మేరకు తగ్గించారో వివరించాల్సిన ఆవశ్యకత ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.  టీఆర్ ఎస్ ను చూసి జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం తట్టుకోలేకపోతున్నాయని విజయశాంతి వ్యాఖ్యానించారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక తర్వాత తెలంగాణ సమాజం ఇదే అభిప్రాయంతో ఉందని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విశ్లేషించారు.
 
ప్రజల సెంటిమెంట్లతో కూడిన అంశాలను తనకు అనుకూలంగా మలుచుకుని.. వాటి ద్వారా కేసీఆర్ తాను చేసిన పాపాలన్నిటికీ ప్రక్షాళన చేసుకోవాలని కలలు కంటున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  

ప్రభుత్వ ఖజానాను ముంచేసి, ఇంతకాలం ఆయన మాయమాటలు చెప్పారని విజయశాంతి ఆరోపించారు. అయితే ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నిజాలను ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు. 

Also read: దీక్ష సక్సెస్: తెలంగాణ బీజేపీ పగ్గాలు ఆమెకేనా...?

అంతే కాకుండా... ఇంతకాలం ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, ఆయన నిజ స్వరూపం వెలుగులోకి వచ్చేరోజు ఎంతో దూరంలో లేదని ఆమె జోశ్యం చెప్పారు. 

ఆ రోజు కోసమే తెలంగాణ ప్రజలంతా వేచి చూస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌కు పోటీగా ఎన్నికల్లో ఖర్చు పెట్టే విషయంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ సైతం తట్టుకోలేకపోతున్నాయని... హుజూర్‌నగర్ ఉపఎన్నిక తర్వాత ఇదే అభిప్రాయాన్ని తెలంగాణ సమాజం కూడా వ్యక్తం చేస్తుందని ఆమె అన్నారు.