హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై తెలంగాణ ఫైర్ బ్రాండ్ డీకే అరుణ కన్నేశారా...? మద్యపాన నిషేధానికి సంబంధించి జేజమ్మ చేపట్టిన రెండు రోజుల నిరసన దీక్ష అందులో భాగమేనా....అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. 

కాంగ్రెస్ పార్టీలో మంచి ఫామ్ లో ఉన్న సమయంలో డీకే అరుణ గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరుకున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయికండువా కప్పుకున్నప్పుడే ఆమె బీజేపీ అధ్యక్ష పదవిపై కన్నేశారంటూ ప్రచారం జరిగింది. 

అయితే బీజేపీలో చేరిన తర్వాత తనదైన శైలిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడే డీకే అరుణ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దిశ, మానస, సమతల ఘటనలకు మద్యమే కారణమని ఆరోపిస్తూ రెండు రోజలుపాటు నిరసన దీక్షకు దిగారు. 

ఇందిరాపార్క్ లోని ధర్నా చౌక్ వద్ద ఆమె రెండు రోజులపాటు ధర్నాకు దిగారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేయాలంటూ ఆమె నిరసనకు దిగారు. ఆమె నిరసనకు ప్రజల నుంచి మద్దతు లభించింది. యువత పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆమెకు లైన్ క్లియర్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. 

గత ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన డీకే అరుణ గట్టి పోటీనే ఇచ్చారు. అయితే త్రిముఖ పోరులో ఓడిపోయారు. అనంతరం ఆమె బీజేపీ అధ్యక్ష పీఠంకోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 

ఢిల్లీ పెద్దలను మెప్పించేందుకు అప్పుడప్పుడూ తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. ఒకానొక దశలో బీజేపీ అధ్యక్షురాలిగా డీకే అరుణ పేరు ఖరారైందని ప్రచారం కూడా జరిగిపోయింది. కానీ అది జరగలేదు. 

అయితే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రేప్, హత్య ఘటనలను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించిన డీకే అరుణ ఆ విషయంలో సక్సెస్ అయ్యారనే ప్రచారం జరిగింది. మద్యం నిషేధం కోసం ఆమె చేసిన రెండు రోజుల దీక్షకు పార్టీ సీనియర్ నేతలు సైతం హాజరుకావడంతో ఆమెకు రూట్ క్లియర్ అయిందంటూ ప్రచారం జరుగుతుంది. 

ఇకపోతే డీకే అరుణ దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించిన సందర్భంలో ఆమెకు పార్టీ సీనియర్ నేతలు సహకరిస్తారా అన్న సందేహం నెలకొంది. లక్ష్మణ్ ఎలా రియాక్ట్ అవుతారా అన్న చర్చ కూడా జరిగింది. 

అలాంటి అనుమానాలకు తావివ్వకుండా తెలంగాణ బీజేపీ రథసారథి డా.కె.లక్ష్మణ్ దీక్షను ముందుండి నడిపించారనడంలో ఎలాంటి సందేహం లేదు. డీకే అరుణ దీక్షను డా.కె.లక్ష్మణ్ ప్రారంభించారు.  

ఇకపోతే దీక్షకు పార్టీలోని సీనియర్ నేతలు సైతం హాజరుకావడం, ఆమెకు సంఘీభావం ప్రకటించడంతో డీకే అరుణ ఆశలు త్వరలోనే నెరవేరబోతున్నట్లు తెగ చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చే యోచనలో బీజేపీ జాతీయ నాయకత్వం ఉందని ప్రచారం కూడా జరుగుతుంది. 

ఇలాంటి తరుణంలో తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి కోసం పలువురు పార్టీ సీనియర్ నేతలు పైరవీలు చేస్తున్నారు. అలాంటి వారిని కాదని ఇటీవలే పార్టీలోకి చేరిన డీకే అరుణకు పట్టం కడతారా అన్న చర్చ కూడా జరుగుతుంది.  

అయితే ఏపీలో సీనియర్ నేతలను కాదని అప్పుడే వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. అలాంటి ఆలోచన తెలంగాణ రాష్ట్రంలోనూ చేస్తే డీకే అరుణకు అధ్యక్ష పీఠం ఖరారయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. 

ఇకపోతే తెలంగాణ బీజేపీ అధ్యక్షురాలుగా డీకే అరుణకు అర్హత ఉందంటూ ఇటీవలే బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు కూడా. డీకే అరుణతోపాటు బీజేపీ ఎంపీలు కూడా అర్హులేనంటూ ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే.