24 గంటల కరెంట్ పచ్చి అబద్ధం.. సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
సీఎం కేసీఆర్ పై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని అన్నారు. కాళేశ్వరంతోనూ కోటి ఎకరాలకు నీటి పారుదల వట్టి అబద్ధం అని ఆరోపించారు.
హైదరాబాద్: వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ స్టాండ్‌నే సమర్థిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. 8 గంటల కరెంట్ కూడా సరిగా ఇవ్వడం లేదని అన్నారు. సాగు నీటిపైనా విమర్శలు సంధించారు. కాళేశ్వరంతోటి కోటి ఎకరాల మాగాణికి నీళ్లు ఇచ్చామని కేసీఆర్ చెబుతున్నారని, కానీ, సాగు నీరు లేక కాల్వల వెంట రైతులు బోర్లు ఎందుకు వేయాల్సి వస్తున్నదని ప్రశ్నించారు.
మండే ఎండల్లోన మత్తడి దుంకుతుందని కేసీఆర్ చెబుతారని, కానీ, నారు మడికైనా నీళ్లు అందడం లేదని రైతులు కన్నీరు పెడుతున్నారని వైఎస్ షర్మిల ఆరోపణలు చేశారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు గోదారి నీళ్లు ఎత్తి గోదారిలో పోయడానికే అన్నట్టుగా ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ జీవధార ప్రాణహిత చేవెళ్ల కట్టాలని మహా నేత అనుకున్నారని, కానీ, దాన్ని కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి కమీషన్ల ధారగా మార్చుకున్నారని వివరించారు. కోటి ఎకరాలకు సాగు నీటి పారుదల అని చెప్పినా లక్ష ఎకరాలకే దిక్కు లేదని తెలిపారు.
Also Read: చెగువేరా నుంచి గాడ్సే వైపు పవన్.. దళారీ అవతారం: పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
ఇప్పటికీ తెలంగాణలో బోరు ఉంటేనే పంట అన్నట్టుగా ఉన్నదని షర్మిల అన్నారు. పనికి రాని ప్రాజెక్టులకు కేసీఆర్ వేల కోట్ల కరెంట్ బిల్లులు కడుతున్నారని, కానీ, రైతులకు మాత్రం సరిపడా కరెంట్ ఇవ్వడం లేదని విమర్శించారు. రైతులకు కనీసం 8 గంటలైనా కరెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. కానీ, 24 గంటలు ఇస్తున్నామని అబద్ధాలు వల్లిస్తున్నారని పేర్కొన్నారు. మూడు పంటలు అబద్ధం అని, 24 గంటల ఉచిత కరెంట్ పచ్చి అబద్ధం అని షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు.