కొంత మంది టీచర్లు తరచూ విధులకు ఎగనామం పెడుతూ రియలేస్టేట్, చీటీల వ్యాపారం నడుపుతుండటం, ప్రైవేట్ వ్యాపారాలు, పాఠశాలలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణా ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడి అడుగుజాడల్లో నడుస్తున్నట్లు కనబడుతోంది. నోట్ల రద్దు చేయటం ద్వారా యావత్ దేశ ప్రజల వ్యతిరేకతను మోడి మూటగట్టుకున్నట్లే కెసిఆర్ కూడా టీచర్లను అనవసరంగా కెలుక్కుంటున్నారు.

ఉపాధ్యయులకు సంబంధించి తాజాగా పాఠశాల విద్యాశాఖ కమీషనర్ జారీ చేసిన ఓ ఉత్తర్వుపై టీచర్లందరూ మండిపడుతున్నారు. ఇంతకీ ఆ ఉత్తర్వుల్లో ఏముందంటే, టీచర్లు తమ ఆదాయ వివరాలతో పాటు ఆస్తులు, పెట్టుబడులతో పాటు కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న ఆస్తులు, అప్పులు, పెట్టుబడుల వివరాలను వెల్లడించాలట. దాంతో ఉపాధ్యాయుల్లో కలకలం రేగుతోంది.

భూములు, ఇండ్లు, బంగారం, డిపాజిట్లు, పాలసీలు.. ఇలా ఆస్తులు ఏ రూపంలో ఉన్నా చెప్పాల్సిందే. ఈ మేరకు అవసరమైన ఫారాలను అన్నీ జిల్లాలకు విద్యాశాఖ పంపింది. ఫారాలన్నీ నింపి విద్యాశాఖకు అందించేందుకు పది రోజులు గడువు కూడా విధించింది.

క్లాసిఫికేషన్ కంట్రోల్ అండ్ అప్పీల్ (సీసీఏ) 1964 నిబంధనల ప్రకారం ప్రతి ప్రభుత్వోద్యోగి తన వార్షిక ఆస్తి, రాబడి ప్రకటించాలి. అయితే కేవలం ఇతర శాఖల్లోని ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తున్న నిబంధనను ఉపాధ్యాయులకు కూడా వర్తింపచేస్తూ గత టీడీపీ ప్రభుత్వం జీవో నంబర్ 52 జారీచేసింది.

దాని ప్రకారం టీచర్లు కూడా తమ ఆస్తుల వివరాలను వెల్లడించాలి. అయితే ఆ ఉత్తర్వలను ఎవరూ పట్టించుకోలేదు. అయితే, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ జీ కిషన్ 18 ఏళ్ల నాటి ఉత్తర్వుకు మరి కొన్ని అంశాలను జోడిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేయటం గమనార్హం.

తాజా ఉత్తర్వులతో పలువురు ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. తమ ఆదాయపన్ను వివరాలు ప్రభుత్వం వద్దే ఉన్నపుడు మళ్లీ కొత్తగా ఎందుకు ఇవ్వాలన్నది టీచర్ల వాదన. అదేవిధంగా, తమ కుటుంబ సభ్యులకు సంబంధించి వివరాలు ప్రభుత్వానికి ఎందుకు చెప్పాలని కూడా ప్రశ్నిస్తున్నారు.

కొంత మంది టీచర్లు తరచూ విధులకు ఎగనామం పెడుతూ రియలేస్టేట్, చీటీల వ్యాపారం నడుపుతుండటం, ప్రైవేట్ వ్యాపారాలు, పాఠశాలలు నిర్వహిస్తున్నారు. తమకున్న రాజకీయ దన్ను చూసుకునే ఇటువంటి ఉపాధ్యాయులు విర్రవీగుతున్నారు. అటువంటి వారి ఆగడాలు ఎక్కువైపోవటంతో మొత్తం ఉపాధ్యాయులపైనే ప్రభుత్వం కన్నేసింది.