నిమజ్జనాన్ని అడ్డుకొంటే ప్రగతి భవన్ లో చేస్తాం: బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్
వినాయక నిమజ్జనం కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. వినాయక నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేయలేకపోతే ప్రగతి భవన్ లో నిమజ్జనం చేస్తామన్నారు.
హైదరాబాద్: హిందూవుల పండుగలను ప్రశాంతంగా జరుపుకునే పరిస్థితి లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సోమవారం నాడు ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్నారు. వినాయకుడికి 20 కేజీల లడ్డూను సమర్పించారు. హైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు బండి సంజయ్, తరుణ్ చుగ్ ను ఘనంగా సన్మానించారు
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. భాగ్యనగర్ లో అతి శక్తివంతమైన ప్రాముఖ్యత కలిగిన మహా గణపతిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దశాబ్దాలుగా మహా గణపతిని ప్రతిష్టిస్తూ ధార్మిక వాతావరణం నెలకొల్పేలా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు బండి సంజయ్.
ఆనాడు బ్రిటీష్ పాలకులను తరిమికొట్టడానికి, హిందూ సమాజాన్ని ఏకం చేసేందుకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించినట్టుగా ఆయన గుర్తు చేశారు ఇవాళ కులాలు, మతాలకు అతీతంగా సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. హిందూ సమాజాన్ని కులాలు, వర్గాలు, వర్ణాలు, సంఘాల పేరుతో చీల్చే ప్రమాదం నుండి తప్పించి సంఘటితంగా మార్చడానికి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన చెప్పారు.
మనతోపాటు సమాజం కూడా బాగుండాలని కోరుకునే వాడే నిజమైన హిందువని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. నిస్వార్థంగా భగవంతుడిని కొలవాలని ఆయన కోరారు. వారానికో పండుగ రోజుకో దేవుడిని కొలిచే గొప్ప సంస్కృతి హిందువులకే సొంతమనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.నిరంతరం హిందూ సమజాం జాగృతం కావాల్సిన అవసరం ఉందన్నారు.
ఇతరుల పండుగలకు లేని ఆంక్షలు హిందూవుల పండుగలకే ఎందుకు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఓ వర్గం ఓట్ల కోసమే టీఆరఎస్ సర్కార్ కుట్ర పన్నిందని ఆయన విమర్శించారు. వినాయక విగ్రహల నిమజ్జనం కోసం ప్రభుత్వం ఇంతవరకు ఏర్పాట్లు చేయలేదని బండి సంజయ్ ఆరోపించారు. వినాయక విగ్రహాల నిమజ్జనం అడ్డుకొంటే ప్రగతిభవన్ లో నిమజ్జనం చేస్తామని ఆయన హెచ్చరించారు.
హిందూ సమాజం చీలిపోతే తెలంగాణకు ప్రమాదకర పరిస్థితులు సంభవిస్తాయన్నారు. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిణామాలను బేరీజు వేసుకుంటే హిందువులంతా సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.టీచర్స్ డే రోజు ఉపాధ్యాయులను అరెస్ట్ చేయడాన్ని బండి సంజయ్ తప్పు బట్టారు. తక్షణమే సీఎం కేసీఆర్ ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.