తెలంగాణ గవర్నర్ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. బడ్జెట్‌ ఫైల్‌కు గవర్నర్ ఆమోదం లభించకపోవడంపై హైకోర్టు‌లో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం లంచ్‌ మోషన్ పిటిషన్‌ దాఖలు చేసింది. 

తెలంగాణ గవర్నర్ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. బడ్జెట్‌ ఫైల్‌కు గవర్నర్ ఆమోదం లభించకపోవడంపై హైకోర్టు‌లో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం లంచ్‌ మోషన్ పిటిషన్‌ దాఖలు చేసింది. బడ్జెట్‌ను ఆమోదించేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోరింది. ఈ లంచ్‌ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు అనుతించింది. వివరాలు.. ఈ రోజు ఉదయం హైకోర్టులో బడ్జెట్ వివాదంపై ప్రభుత్వం లంచ్ మోహన్‌ పిటిషన్ దాఖలు చేయనున్నట్టుగా అడ్వొకేట్ జనరల్ తెలిపారు. గవర్నర్ బడ్జెట్ ఫైల్‌కు ఆమోదం తెలుపలేదని చెప్పారు. 

గవర్నర్ ఆమోదం లభించకపోతే.. అసెంబ్లీ ప్రవేశపెట్టేందుకు వీలు ఉండదని అన్నారు. ఈ క్రమంలోనే స్పందించిన హైకోర్టు.. ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య జరుగుతున్న ఈ విషయంలో తామేలా జోక్యం చేసుకుంటామని ప్రశ్నించింది. బడ్జెట్‌కు ఆమోదం లభించకపోతే.. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలపై ప్రభావం పడే అవకాశం ఉందని న్యాయస్థానానికి ఏజీ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే హైకోర్టు లంచ్‌మోషన్ పిటిషన్‌ను అనుమతించింది. మధ్యాహ్నం ఒంటి గంటకు విచారించనున్నట్టుగా తెలిపింది. 

Also Read: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందా?.. ప్రభుత్వానికి రాజ్‌భవన్ నుంచి రిప్లై..!

హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని తప్పనిసరి చేసే శాసన నిబంధన ఏదీ లేదని.. బడ్జెట్‌ను సమర్పించడంలో దానికి ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.