తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు మధ్య దూరం మరింతగా పెరిగింది. ఈ ప్రభావం అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్‌పై నీలినీడలు కమ్మేసింది.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు మధ్య దూరం మరింతగా పెరిగింది. ఈ ప్రభావం అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్‌పై నీలినీడలు కమ్మేసింది. ఫిబ్రవరి 3న బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి గవర్నర్ నుంచి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం జనవరి 21న గవర్నర్ కార్యాలయానికి ఫైల్‌ను పంపింది. అయితే ఇప్పటికీ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ నుంచి ఎటువంటి ఆమోదం లభించలేదు.
మరోవైపు రాజ్‌భవన్ నుంచి గవర్నర్ ప్రసంగానికి సంబందించి ప్రభుత్వానికి సంబంధించి ప్రశ్న సంధించినట్టుగా తెలుస్తోంది. బడ్జెట్‌కు సంబంధించిన ఫైల్‌ను రాష్ట్ర ప్రభుత్వం పంపగా.. అసెంబ్లీలో గవర్నర్ సంప్రదాయ ప్రసంగం కోసం ఏర్పాట్లకు సంబంధించి గవర్నర్ సెక్రటరీ ప్రభుత్వానికి రిటర్న్ కమ్యూనికేషన్ పంపారు. ఒకవేళ ప్రసంగం ఉంటే.. ధ్రువీకరణ కోసం ప్రసంగం కాపీని కోరారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి రిప్లై వెళ్లలేదని తెలుస్తోంది. ఇక, శాసనసభ బడ్జెట్ సమావేశాలను రాష్ట్ర గవర్నర్ ప్రసంగంతో ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే దీనికి విరుద్ధంగా గవర్నర్ ప్రసంగం లేకుండానే నిరుడు బడ్జెట్ సమావేశాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. అసెంబ్లీని ప్రోరోగ్ చేయకపోవడంతో గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు నిర్వహించినట్టుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఫిబ్రవరి 3న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్టుగా ఇప్పటికే ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. అందుకు గడువు సమీపిస్తున్న గవర్నర్ ఆమోదం లభించకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బడ్జెట్‌ను ఆమోదించేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సోమవారం లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని తప్పనిసరి చేసే శాసన నిబంధన ఏదీ లేదని.. బడ్జెట్‌ను సమర్పించడంలో దానికి ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు.
గతేడాది ఏం జరిగిందంటే..
కేసీఆర్ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో.. గతేడాది గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలను ప్రారంభించారు. అసెంబ్లీని ప్రోరోగ్ చేయకపోవడంతో గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు నిర్వహించినట్టుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఆ సమయంలో బడ్జెట్ ఫైల్‌కు గవర్నర్ ఆమోదం లభించింది. అయితే గతేడాది బడ్జెట్ సమావేశాల్లో తన ప్రసంగాన్ని రద్దు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై మండిపడ్డారు. తనను అవమానించడానికే తెలంగాణ ప్రభుత్వం ప్రసంగాన్ని రద్దు చేసిందని అన్నారు. అయిత, తాను మాత్రం ప్రభుత్వం పంపిన బడ్జెట్ట్ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని.. సిఫారసు చేశాననని చెప్పారు. తాను తలచుకుంటే బడ్జెట్ ప్రతిపాదనలను సిఫారసు చేయకుండా పెండింగ్‌లో పెట్టగలనని అన్నారు.
