కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ హుష్ కాకి: చంద్రబాబుదే పైచేయి

KCR gels with NDA CMs, Chandrababu with non-BJP ones
Highlights

నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా ఆదివారంనాడు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శైలి అందరినీ అశ్చర్యపరిచింది.

న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా ఆదివారంనాడు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శైలి అందరినీ అశ్చర్యపరిచింది. బిజెపి, కాంగ్రెసేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తానని చెప్పిన కేసిఆర్ వ్యవహారశైలి ఆచరణలో అందుకు భిన్నంగా కనిపించింది. 

నీతి ఆయోగ్ సమావేశంలో కేసిఆర్ బిజెపి, ఎన్డీఎ ముఖ్యమంత్రుల వైపు ఉండగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజెపి వ్యతిరేక సిఎంల వైపు ఉన్నారు. 

ప్రధాని నరేంద్ర మోడీ సమావేశ మందిరంలోకి ప్రవేశించిన సమయంలో కేసిఆర్ రమణ సింగ్ (ఛత్తీస్ గడ్), శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), నితీష్ కుమార్ (బీహార్) ముఖ్యమంత్రుల పక్కన నించున్నారు.

చంద్రబాబు నాయుడు మమతా బెనర్జీ, కుమార స్వామి, పినరయ్ విజయన్ పక్కన నించున్నారు. బిజెపిని వ్యతిరేకిస్తున్న సిఎంల వరుసలో చంద్రబాబు ఉన్నారు. 

దానికి తోడు, నాలుగు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న కేసిఆర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలవడానికి ఏ మాత్రం ప్రయత్నించలేదు. లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో నిరసనకు దిగిన కేజ్రీవాల్ కు ఆయన సంఘీభావం కూడా తెలుపలేదు. 

చంద్రబాబు సహా బిజెపిని వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రులు కేజ్రీవాల్ కు సంఘీభావం తెలియజేశారు. సమావేశం సందర్భంగా ఆ విషయాన్ని ప్రధాని దృష్టికి తెచ్చారు. 

ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనలతో మమతా బెనర్జీని, కుమారస్వామిని గతంలో కేసిఆర్ కలిశారు. ఢిల్లీ పర్యటనలో మాత్రం వారిని కలవడానికి ఆయన ప్రయత్నాలు చేసినట్లు కూడా కనిపించలేదు. 

నీతి ఆయోగ్ సమావేశానికి రెండు రోజుల ముందు కేసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. దీంతో ఆయన బిజెపి సరసన చేరుతున్నారా అనే అనుమానాలకు తావిచ్చారు. 

కాగా, బిజెపిని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీలు కాంగ్రెసుకు సన్నిహితంగా మెలుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసును కలుపుకుని పోటీ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే, తెలంగాణలో కేసిఆర్ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసు పార్టీ. దీంతో ఆయన తన వ్యూహాన్ని మార్చుకున్నారని అంటున్నారు. 

loader