RTC Strike: అర్టీసీకి కేసీఆర్ మంగళం, మధ్యప్రదేశ్ మోడల్

ఆర్టీసీకి మొత్తంగానే మంగళం పాడాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ లో మాదిరిగా సిబ్బందికి వీఆర్ఎస్ ఇచ్చి ఆర్టీసీని మూసేసి ప్రైవేట్ ఆపరేటర్లకు రూట్ల పర్మిట్లు ఇవ్వాలని చూస్తున్నారు.

KCR eyes Madhya Pradesh model, which shut RTC, gave staff VRS

హైదరాబాద్: ఆర్టీసీ విషయంలో తన ఆలోచనను కార్యరూపంలోకి తెచ్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఆర్టీసీకి మంగళం పాడాలనే ఉద్దేశం ఆయనకు ఉన్నట్లు పలుమార్లు ఆయన మాటల్లో వ్యక్తమవుతూ వస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయబోమని స్పష్టంగా చెబుతూనే తన ఆలోచనలను విడతలు విడతలుగా పంచుకుంటూ వస్తున్నారు. 

ఆర్టీసి సమ్మె నేపథ్యంలో కేసీఆర్ కీలకమైన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. మధ్యప్రదేశ్ మోడల్ ను అమలు చేయడానికి కేసీఆర్ సిద్ధపడినట్లు తెలుస్తోంది. భారీ నష్టాలు కారణంగా మధ్య ప్రదేశ్ 2005లో ఆర్టీసీని మూసేసింది. సిబ్బందికి స్వచ్ఛంద పదవీ విరమణ ఆఫర్ ఇచ్చింది. అప్పటి నుంచి 35 వేల ప్రైవేట్ బస్సులు అన్ని రూట్లలోనూ నడుస్తున్నాయి.

Also Read: RTC Strike: ప్రభుత్వం దిగివస్తేనే డ్రైవర్ బాబు అంత్యక్రియలు...లేదంటే: ఎంపీ

ఛత్తీస్ గడ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ప్రజా రవాణా వ్యవస్థలను కేసీఆర్ పరిశీలించారు. ఈ రాష్ట్రాల్లో చాలా రూట్లను ప్రభుత్వాలు ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించారు. అయితే, చివరగా కేసీఆర్ మధ్యప్రదేశ్ తరహా విధానానికే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే అదే విధమైన డిమాండ్ 56 కార్పోరేషన్ల నుంచి కూడా రావచ్చునని కేసీఆర్ భావిస్తున్నారు. అది తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఆర్టీసీ సమ్మెపై కాంగ్రెసు, బిజెపిల వైఖరిని ఆయన వివరించే అవకాశం ఉంది. ఆర్టీసీలో కేంద్రం వాటా 31 శాతం ఉంది. ఆ వాటా మేరకైనా కేంద్రం సబ్సిడీలను ఇవ్వడం లేదని ఆయన చెప్పదలుచుకున్నారు. 

కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి గానీ తెలంగాణ బిజెపి నేతలు కూడా ఆసక్తి ప్రదర్శించడం లేదని అంటున్నారు. గత 27వ రోజులుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. దీంతో శనివారం జరిగే మంత్రి వర్గ సమావేశంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చ జరిగే అవకాశం ఉంది. 

విలీనం విషయంలో ఆర్టీసీ కార్మికలు కచ్చితమైన విధానాన్ని అనుసరించడం లేదని, విలీనం తమ డిమాండ్ కాదని కోర్టుకు చెబుతున్న నేతలు సకల జనుల సమర భేరీలో మాత్రం విలీనం తమ డిమాండు అని చెబుతున్నారని కేసీఆర్ మంత్రులకు చెప్పే అవకాశం ఉంది. 

Also Read: RTC Strike: 27వ రోజుకు ఆర్టీసీ సమ్మె, మరో డ్రైవర్ మృతి

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 2019 మోటారు వాహనాల సవరణ చట్టంలోని  సెక్షన్ 67 వల్ల ప్రైవేట్ ఆపరేటర్లకు రూట్ల పర్మిషన్ ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వాలకు సులభంగా మారిందని కేసీఆర్ భావిస్తున్నారు. దాని ఆసరా చేసుకుని ప్రైవేట్ ఆపరేటర్లకు పెద్ద యెత్తున రూట్ల పర్మిట్లను ఇచ్చే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios