మంత్రి హరీష్ రావు ఈ రోజు అంబేద్కర్ జయంత్యుత్సవాల్లో పాల్గొని మాట్లాడుతూ మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మార్గదర్శకాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ నడుచుకుంటున్నారని, రాష్ట్రంలో దళితులు అన్ని రంగాల్లో ఎదగడానికి సమాన అవకాశాలు కల్పిస్తున్నారని వివరించారు. ఇదే సందర్భంగా దళితులు, మహిళల కోసం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఏకరువు పెట్టారు. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంత్యుత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ పెద్దలు, అధికారులు, అన్ని వర్గాల వారు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి హరీష్ రావు ఈ రోజు సిద్దిపేటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ అంబేద్కర్ చెప్పిన ఓ వ్యాఖ్యను గుర్తు చేశారు. విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాల్లో అన్ని వర్గాలు ఎదగడానికి సమాన అవకాశాలు కల్పిస్తున్నారని, వీటిని ఉపయోగించుకుని అభివృద్ధి సాధించాల్సిన బాధ్యత ముందు తరాలపై ఉన్నదని
అంబేద్కర్ పేర్కొన్నట్టుగా గుర్తు చేశారు. ఈ అంబేద్కర్ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో దళితులకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తున్నారని వివరించారు.

దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ వీలైన అన్ని మార్గాల్లో అభివృద్ధి చేస్తున్నారని మంత్రి హరీష్ రావు వివరించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ల్యాప్స్ కాకుండా.. వాటిని దళితుల సంక్షేమం కోసం ఉపయోగిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఈ ఏడాది చివరినాటికి రాష్ట్రంలోని సుమారు రెండు లక్షల మంది అర్హులకు దళితబంధు అందించడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. విడతల వారీగా ప్రతి దళిత కుటుంబానికి దళిత
బంధు అందిస్తామని వివరించారు. 

తెలంగాణ సాధించిన తర్వాత రాష్ట్రంలో ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలు రెట్టింపు అయినట్టు తెలిపారు. 50 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను నెలకొల్పామని వివరించారు. వీటితోపాటు మహిళా రెసిడెన్షియల్ పీజీ, లా కాలేజీలని ప్రారంభించినట్టు పేర్కొన్నారు. దళిత విద్యార్థుల కోసం విదేశీ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద రూ. 20 లక్షలు గ్రాంటు ఇస్తున్నట్టు తెలిపారు.

ఇదే సందర్భంలో ఎస్సీ విద్యార్థుల కోసం లైబ్రరీ ఏర్పాటుకూ ప్రోత్సహిస్తామని వివరించారు. అంబేద్కర్ భవన్‌లలో ఎస్సీ విద్యార్థులకు లైబ్రరీల ఏర్పాటుకు సంఘాలు ముందుకు వస్తే.. వారికి లక్ష రూపాయల నిధులు ఇచ్చి ప్రోత్సహిస్తామని తెలిపారు. అంతేకాదు, సిద్దిపేట నియోజకవర్గంలో ఏడాదిలోగా అంటే వచ్చే అంబేద్కర్ జయంతిలోగా ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పుతామని హామీ ఇచ్చారు.

బెస్ట్ అవైలేబుల్ స్కూల్ స్కీమ్ ద్వారా మరింత మంది పేద దళిత విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించడానికి కృషి చేస్తామని మంత్రి హరీష్ రావు వివరించారు. డబుల్ బెడ్ రూమ్‌లలో 50 శాతం దళిత కుటుంబాలకు కేటాయించామని తెలిపారు. అంతేకాదు, ఈ ఏడాది సిద్దిపేట పట్టణంలో సొంత ఇంటి జాగ కలిగిన 500 మందికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహకారం ఇస్తామని అన్నారు.