Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్ర పాలకులకు తొత్తులు, ఆగమైపోతాం: కేసిఆర్

కాంగ్రెసు నాయకుల మాటలు నమ్మితే ఆగమైపోతామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు.

KCR criticises Telangana Congress leaders

కరీంనగర్:  కాంగ్రెసు నాయకుల మాటలు నమ్మితే ఆగమైపోతామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. ఆంధ్ర నాయకులు తెలంగాణ ప్రాజెక్టులు పండబెట్టి మన పొలాలు ఎండబెట్టి, మోటార్లూ ట్రాన్స్ పారాలు కాలబెడితే ఆంధ్ర తొత్తులుగా వ్యవహరిస్తూ కాంగ్రెసు నాయకులు ఒక్క మాట మాట్లాడలేదని అన్నారు. 

ఏ నోరుతో కాళేశ్వరం ప్రాజెక్టు వద్దని చెబుతున్నారని ఆయన కాంగ్రెసు నాయకులను ప్రశ్నించారు. పాత కరీంనగర్ జిల్లా ధర్మరాజుపల్లిలో ఆయన గురువారం రైతు బంధు పథకాన్ని ప్రారంభించారు.

ఆనాడు కరెంట్ వస్తే వార్త, ఇప్పుడు కరెంట్ పోతే వార్త అని ఆయన అన్నారు. మూడు పంటలు పండించే అవకాశం కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒనగూరుతోందని అన్నారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు అంగీకారం రాలేదని అన్నారు. మూడు రాష్ట్రాలతో కయ్యం పెట్టుకోకుండా ముఖ్యమంత్రులను సముదాయించి మూడు ప్రాజెక్టులకు ఒప్పందం చేసుకున్నామని, సిడబ్ల్యుసి ఆమోదం కూడా పొందామని చెప్పారు. 

కాంగ్రెసు వాళ్లలాగా ఇంట్లో పడుకోలేదని అన్నారు. నీళ్లు పటిష్టంగా వచ్చే విధంగా ప్రణాళికలు వేసుకున్నామని అన్నారు. ఈ ఏడాది చివరికి నీళ్లు వస్తాయని, తెలంగాణ నిత్య కల్యాణం పచ్చతోరణంగా ఉంటాయని అన్నారు. యావత్తు తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులు పూర్తి చేస్తామని అన్నారు. ఆంధ్ర పాలకులు పెండింగులో పెడితే ప్రాజెక్టుల గురించి కాంగ్రెసు నాయకులు మాట్లాడలేదని అన్నారు. 

పొట్టిగానే, బక్కగానే ఉన్నాం గానీ గట్టిగా ఉన్నామని, పని మాత్రం బాగానే చేస్తున్నామని అన్నారు. మీ ఆకారాలు చాలా పెద్దవి కానీ పనులు చేయలేదని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగులది కూడా కీలక పాత్ర అని చెప్పారు. 

వ్యవసాయం బాగున్నప్పుడే దేశం బాగుంటుందని అన్నారు. ఇప్పుడున్న ధరతో నాలుగో వంతు ధర పెంచాలని ఆయన అన్నారు. పాస్ పుస్తకాలు, కాగితాలు ఇంటికి వస్తాయని, వెబ్ సైట్లలో చూసుకోవచ్చునని, గోల్ మాల్ ఉండదని, భూమి రిజిస్ట్రేషన్ పక్కాగా చేస్తున్నామని అన్నారు. భూముల రిజిస్ట్రేషన్ అధికారం ఎమ్మార్వోలకు ఇస్తున్నట్లు తెలిపారు. 

రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతు కుటుంబానికి ఆరు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నామని, ఏ రాష్ట్రం కూడా ఇలా ఇవ్వడం లేదని అన్నారు. ఆరు నూరైనా సరే కోటి ఎకరాలు పచ్చబడే దాకా కేసిఆర్ నిద్రపోడని అన్నారు. 

పంట పెట్టుబడి రైతులకు మాత్రమే ఇస్తామని, కౌలుదార్లకు ఇవ్వబోమని, కౌలుదార్ల బాధ్యత రైతులదేనని చెప్పారు. అగ్రకులాల్లోని పేదలకు తగిన న్యాయం చేస్తామని చెప్పారు. వారికి తగిన పథకాన్ని ప్రకటిస్తామని చెప్పారు. 

కొంత మంది రాజకీయం కోసం అవాకులు చెవాకులు పేలుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఐదు లక్షల రూపాయల బీమా చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. జూన్ 2వ తేదీ తర్వాత వస్తాయని అన్నారు. 

రైతు సమన్వయ కమిటీ సభ్యులు రైతులకు అందాల్సిన సాయాన్ని అందేలా చూడాలని అన్నారు. వృత్తిపనివారికి కూడా తగిన సాయం చేస్తున్నట్లు తెలిపారు. యాదవులు గొర్రెల పథకం ద్వారా వేయి కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని అన్నారు. మోటారు సైకిళ్లు, బర్రెలు కొనీయడం వంటి పనులు చేపడుతామని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios