ముక్కును నేలకు రాస్తావా, రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తా: ఉత్తమ్ కు కేసీఆర్ సవాల్

KCR challenges Uttam Kumar Reddy
Highlights

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొందరు శాపాలు పెట్టారని, ఎవరెన్ని విమర్శలు చేసినా నిజాయితీగా పాలన అందిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు అన్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొందరు శాపాలు పెట్టారని, ఎవరెన్ని విమర్శలు చేసినా నిజాయితీగా పాలన అందిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు అన్నారు. టిఆర్ఎస్ ప్లీనరీలో ఆయన శుక్రవారం ఉదయం ప్రసంగించారు. 

పార్టీ పెట్టినప్పుడు ఎన్నో అవమానాలను ఎదుర్కున్నామని, అందరి అంచనాలను అధిగమిస్తూ తెలంగాణ సాధించామని ఆయన చెప్పారు. 31 జిల్లాల్లో అద్భుతమైన పాలన సాగుతోందని అన్నారు. గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత తమదేనని అన్నారు. 

తెలంగాణ పథకాలను కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అభినందించాయని అన్నారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు మే 10వ తేదీ నుంచి రైతులకు ఎకరానికి రూ.4 వేల చొప్పున అందించబోతున్నట్లు తెలిపారు.  

ఆంధ్ర నాయకులకు సంచులను మోసినవారు కాంగ్రెసు అధ్యక్షులుగా, బిజెపి అధ్యక్షులుగా ఉన్నారని ఆయన అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి టిపిసిసి వచ్చిందంటే తెచ్చి పెట్టిందే టీఆర్ఎస్ అని అన్నారు. 

సంచులు మోసుకుంటూ ఉండేవాడని గుర్తుంచుకోవాలని అన్నారు. 14 ఏళ్ల మడమ తిప్పని పోరాటమే తెలంగాణను తెచ్చిందని, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. తెలివితేటలు లేవని, ప్రగతి భవన్ లో 150 గదులు కట్టారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. 

ఈ రోజు సాయంత్రం ఐదారు గంటలకు సభ అయిపోతుందని, ఏడున్నర 150 కాదు, 15 గదులు చూపించకపోతే నువ్వు ముక్కుకు నేలకు రాయాలని, నిరూపిస్తే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు.  

కాళేశ్వరంతో పాటు మూడు ప్రాజెక్టులకు ఒప్పందం చేసుకుని వస్తే తామే తెచ్చానని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారని, రాజభవన్ వచ్చి నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని చెప్పానని, కానీ రాలేదని, తోక ముడిచారని ఆయన కాంగ్రెసు నాయకులపై విమర్శలు చేశారు.

డబుల్ బెడ్రూం ఇళ్ల గురించి ఆలోచించారా, డబ్బాల్లాంటి ఇళ్లు కట్టారని, తాము కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లు కనిపించడం లేదా అని అడిగారు. ఎన్నికల మ్యానిఫెస్టోను వందశాతం అమలు చేసిన ఘతన టిఆర్ఎస్ దేనని అన్నారు. 

సొల్లుపురాణం, అవాకూలూ చెవాకూలు పేలుతున్నారని ఆయన అన్నారు. దేశం దిగ్బ్రాంతికి గురయ్యే విధంగా పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. కర్ణాటక మంత్రి రేవన్న వచ్చి తమకు 24 గంటల కరెంట్ ఇస్తున్నారంటూ ప్రశంసిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఇసుక పాలసీ బాగుందని నవజోత్ సింగ్ చెప్పారని, కాంగ్రెసు పార్టీ వాళ్లే ప్రశంసిస్తుంటే రాష్ట్ర కాంగ్రెసు నాయకులు విమర్శలు చేస్తూ చిల్లరమల్లర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. 

అద్బుతమైన పని తెలంగాణలో జరుగుతోదని అన్నారు. అనేకమైన రికార్డులు సాధించుకుంటూ ముందుకు సాగుతున్నామని అన్నారు. దశాబ్దాలపాటు తెలంగాణను వేధించిన పార్టీ కాంగ్రెసు అని అన్నారు.

దేశ రాజకీయాల గురించి ఆలోచించే స్థితికి టిఆర్ఎస్ ఎదిగిందని అన్నారు. దేశంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.   మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అద్భుతమైన ప్రాజెక్టులని అన్నారు. వాటిని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించాలని నీతి ఆయోగ్ సూచించిందని అన్నారు. 

దేశ రాజకీయాల్లో తాను నిర్వహించాల్సిన పాత్రపై నిర్ణయం తీసుకోవాలని తనకు బాధ్యత అప్పగించారని చెప్పారు.  వివిధ పదవులు నిర్వహించిన అనుభవంతో దేశం ముందుకు పోతున్న పరిస్థితులు చూస్తే, దేశంలో జరగాల్సింది జరగడం లేదని, దాన్ని సవరించాల్సి ఉందని అన్నారు. 

loader