పలువురు ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేసీఆర్ ను ఆకాశానికెత్తారు. ప్రత్యర్థులు సైతం మెచ్చుకునే రాజకీయశైలి, గొప్ప వాక్పటిమ అంటూ చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి KCR Birthday సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీతో సహా పలువురు, రాజకీయ, సినీ ప్రముఖులు కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కె.సి.ఆర్. గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు... పవన్ కళ్యాణ్
Janasena అధినేత, పవర్ స్టార్ Pawan Kalyan తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘గొప్ప వాక్పటిమ, ముందుచూపు కలిగిన రాజకీయ పోరాట యోధుడు కె.సి.ఆర్. ఎంతటి జఠిలమైన సమస్య State of Telanganaకి ఎదురైనా తన మాటలతో, వాక్చాతుర్యంతో ప్రజలకు స్వాంతన చేకూర్చడంలో ఆయనకు ఆయనే సాటి’ అంటూ ప్రశంసించారు.
ఇంకా చెబుతూ.. ‘ఆయన రాజకీయ ప్రయాణం, తెలంగాణ సాధనలో ఆయనదైన పోరాటం శ్రీ కె.సి.ఆర్.గారిని తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలుపుతుంది. సమకాలీన రాజకీయనాయకులలో తనకంటూ ఒక ప్రత్యేక పంథాను ఏర్పరచుకుని రాజకీయ ప్రస్థానం కొనసాగించడం కె.సి.ఆర్.గారిలోని మరో ప్రత్యేకత. ఆయన రాజకీయ శైలిని ప్రత్యర్ధులు సైతం మెచ్చుకోకుండా ఉండలేరన్నది నిగూఢమైన నిజం. రాష్ట్ర విభజన తరవాత హైదరాబాద్ తోపాటు తెలంగాణ అంతటా శాంతిభద్రతలు పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం.. విజ్ఞులందరితోపాటు నాకూ ఆనందాన్ని కలిగించింది’ అని సంతోషం వ్యక్తం చేశారు. ‘నూతన వసంతంలోకి అడుగిడుతున్న శుభ తరుణంలో కె.సి.ఆర్. గారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను’ అన్నారు.
కేసీఆర్ కు చంద్రబాబు గ్రీటింగ్స్...
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత Nara Chandrababu Naidu కూడా తెలంగాణ సీఎం కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సదా ఆనంద ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.
ఇక వైసీపీ ఎంపీ Vijay Sai Reddy కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు.
