ప్రగతిభవన్ నట్టింట్లో... కేసిఆర్ పవన్ భేటీ

ప్రగతిభవన్ నట్టింట్లో... కేసిఆర్ పవన్ భేటీ

‘‘వాడెవడో సినిమా యాక్టర్ అట.. నేను చిటికేస్తే ముక్కలు ముక్కలు అయితడు’’ ఈ డైలాగ్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలామందికి ఇంకా గుర్తుంది. ఎందుకు గుర్తు ఉండదు.. ఆ డైలాగ్ కొట్టిన మనిషి మామూలు మనిషి కాదు.. ఆ డైలాగ్ ఎవరి మీద కొట్టిండో... ఆ మనిషి కూడా మామూలోడు కాదు.. ఇద్దరూ తెలుగు జనాలకు తెలియని వ్యక్తులు కాదు.. అందుకే ముక్కలు ముక్కలైపోతాడన్న డైలాగ్ అందరికీ బాగానే తెలిసే ఉంది.

మరి ఆ డైలాగ్ కొట్టింది ఇప్పటి సిఎం కేసిఆర్.. ఎవరి మీద అంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద. కానీ అదంతా గతం.. ఇప్పుడు పరిస్థితులు వేరు. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా పరుగులు పెడుతున్నది. ఈ సమయంలో పాత శత్రువులంతా కలిసిపోతున్నారు. పాత మిత్రులు కొత్త శత్రువులుగా మారుతున్నారు.

తెలంగాణ ఉద్యమ కాలంలో కేసిఆర్ పంచ్ డైలాగులతో సీమాంధ్ర నేతల మీద విరుచుకుపడిన సందర్భం ఉంది. ఆసమయంలో పవన్ మీద కూడా కేసిఆర్ ఘాటుగానే విమర్శలు గుప్పించారు. కానీ వారిద్దరి మధ్య ఈ అగాథం సమసిపోయిందని తాజా ఘటన నిరూపించింది.

సోమవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు కేసిఆర్ నివాసం ప్రగతిభవన్ కు వచ్చారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కు ప్రగతిభవన్ లో అసాధారణమైన మర్యాదలు లభించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రగతి భవన్ లో మూడు ప్రధాన భవనాలుంటాయి. అందులో ఒకటి అధికారిక ప్రగతిభవన్.. ఇందులో.. అధికారుల ఛాంబర్లు, సిఎం ఛాంబర్లు, విఐపిలు వస్తే కలవడానికి గదులు ఉంటాయి. దాంతోపాటు రెండో భవనం జనహిత. భారీగా జనాలు వచ్చినా.. పెద్ద సంఖ్యలో నేతలతో సమావేశాలు జరిపినా.. పెద్ద సంఖ్యలో అధికారులతో భేటీలు జరిపినా ఇక్కడే జరుగుతాయి. ఇక మూడో భవనం కేసిఆర్ అధికారిక నివాసం. ఇక్కడకు ఎవరూ రారు. అత్యంత కీలకమైన వ్యక్తులకు మాత్రమే ఈ అధికారిక భవనంలోకి అనుమతి ఉంటుంది. హెమాహేమీలకు సైతం ఈ భవనంలోకి అనుమతి ఉండదు.

అయితే ఇవాళ జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకంగా సిఎం అధికారిక నివాసంలోనే కలిసినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు, అధికారులు, స్పీకర్ లాంటి వారికి కూడా వెసులుబాటు లేనిది పవన్ కు అవకాశం రావడం పట్ల టిఆర్ఎస్ శ్రేణుల్లో సైతం ఆశ్చర్యం కలుగుతోంది. ఈ సందర్భంగా సిఎం కేసిఆర్, పవన్ మధ్య అనేక అంశాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.  

సిఎం కేసిఆర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు పవన్ ప్రగతి భవన్ వెళ్లినట్లు టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అదే సమయంలో సిఎం కేసిఆర్ గవర్నర్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు రాజ్ భవన్ వెళ్లారు. పవన్ ను కేసిఆర్ నివాసంలోనే కొద్దిసేపు కూర్చోబెట్టారు. సిఎం వచ్చిన తర్వాత ఈ సమావేశం జరిగింది. ప్రపంచ తెలుగు మహాసభలకు అందరూ సినీ స్టార్స్ మాదిరిగానే పవన్ కళ్యాన్ కు కూడా ఆహ్వానం పంపింది తెలంగాణ సర్కారు. అయితే కారణాలేమైనా పవన్ తెలుగు సభలకు హాజరు కాలేదు. దిగ్గజ నటులంతా హాజరయ్యారు. తుదకు పవన్ అన్న చిరంజీవి కూడా తెలుగు సభల వేదిక పంచుకున్నారు.

అయితే పవన్ తెలుగు సభలకు హాజరుకాలేకపోయిన నేపథ్యంలో ఇవాళ సిఎం కేసిఆర్ ను ప్రత్యేకంగా కలిసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఏకంగా సిఎం అధికారిక నివాసంలోకి వెళ్లి సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page