తెలంగాణ రాజకీయాలు కొంతకాలంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ సాగుతున్నాయి. తాజాగా అల్లుడితో కలిసి కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించడంతో అసలేం జరుగుతుందో అన్న ఉత్కంఠ పెరిగింది.
KCR : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భారీ అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది... కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు, ఇతర నాయకుల ఈ ప్రాజెక్ట్ పేరిట వేలకోట్ల ప్రజాధనం దోచుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి సహా ఆ పార్టీ నాయకులంతా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం సుప్రీంకోర్టు రిటైర్ట్ జడ్జి జస్టిస్ పిసి ఘోష్ అధ్యక్షతన ఓ కమీషన్ ఏర్పాటుచేసి కాళేశ్వరంపై విచారణ చేయించింది. ఈ కమీషన్ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలు జరిగినట్లు తేల్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ సందర్భంగా కేసీఆర్ అరెస్ట్ పై మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి.
అయితే తాజాగా మాజీ సీఎం కేసీఆర్ వ్యవహారతీరు చూస్తుంటే ఆయనకూ అరెస్ట్ భయం పట్టుకుందా? అనే అనుమానం కలుగుతోంది. కాళేశ్వరంపై పిసి ఘోష్ కమీషన్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఈ పిసి ఘోష్ కమీషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని మామాఅల్లుడు కేసీఆర్, హరీష్ రావులు వేర్వేరు పిటిషన్ల ద్వారా హైకోర్టును కోరారు.
తెలంగాణ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తోందని... పిసి ఘోష్ కమీషన్ నివేదికను కూడా ఇందులో భాగమేనని బిఆర్ఎస్ అధినేత పేర్కొన్నారు. కాబట్టి ఈ కమీషన్ నివేదికపై స్టే ఇవ్వాలని ఆయన కోరారు. ఇలా కేసీఆర్, హరీష్ రావు దాఖలుచేసిన పిటిషన్లపై రేపు (బుధవారం) హైకోర్టు విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. మరి వీరి పిటిషన్లపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి.


