తెలంగాణ సర్కారు న్యూ ఇయర్ కానుకగా రాష్ట్ర రైతాంగానికి 24 గంటల కరెంటు ప్రకటించింది. దేశంలోనే టాప్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అందుకే కావొచ్చు... దేశంలోని అన్ని ప్రముఖ పత్రికల్లో వాణిజ్య ప్రకటనలు ఇచ్చింది. అన్నింటిలోనూ ఫ్రంట్ పేజీలో యాడ్స్ కుమ్మరించింది. ఈ కరెంటు సమాచారంతో కూడిన ప్రకటనలకే సుమారు 50 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు విశ్వసనీయ లెక్కలు చెబుతున్నాయి. ఒక్క ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికకు దక్షిణ భారత దేశమంతటా 31 ఎడిషన్లలో మొదటి పేజీల్లో యాడ్స్ కుమ్మరించారు. ఇక తెలుగు పేపర్లు, ఇంగ్లీషు, హిందీ భాషల్లోనూ యాడ్స్ ఇచ్చారు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తే ఇచ్చారు.. కానీ ఇంత భారీగా దేశమంతా ప్రచారం చేయడం పట్ల తెలంగాణ జెఎసి ఆగ్రహం వ్యక్తం చేసింది.

తెలంగాణ సర్కారు నిరంతర విద్యుత్ పేరుతో చేసిన ప్రకటనలు పచ్చి మోసం అంటూ జెఎసి కొత్త లెక్కలు ప్రచారంలోకి తెచ్చింది. ఈమేరకు జెఎసి ఛైర్మన్ కోదండరాం ఒక ప్రకటన వెలువరించారు. ఆ ప్రకటన యదాతదంగా కింద ఇస్తున్నాం. చదవండి.

 

వ్యవసాయ రంగానికి 24గంటల విద్యుత్తు ప్రచారాలు – వాస్తవాలు

ఈ రోజు పత్రికలు చూస్తే కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా చేస్తూ వ్యవసాయానికి 24 గంటల సరఫరాపై ప్రకటనలు.చేసిన వాగ్దానాలనన్నింటినీ గాలికి వదిలేసి -( నిరుద్యోగ సమస్య, డబల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, కేజీ టూ పీజీ, ఫీజు రీయింబర్స్మెంట్...చెప్పాలంటే లిస్టు పెద్దదే...), హాస్టళ్లలో చలికి గజగజ వణుకుతున్న పిల్లలకు కనీసం దుప్పట్లు ఇవ్వకుండా, అమ్మాయిలకు స్కూళ్లలో, హాస్టళ్లలో టాయిలెట్లను కట్టివ్వలేని ఈ ప్రభుత్వం, రైతులకు 24గంటల విద్యుత్తుపై అంత ఆసక్తి ఎందుకు? అసలు ఎలా ఇవ్వగలుగుతున్నది? ఇదంతా మన ముఖ్యమంత్రి దీక్షా దక్షతనేనా? అన్నింటిలో విఫలమైన ఈ ప్రభుత్వం ఈ ఒక్క అంశంలో సఫలమైందంటే నమ్మశక్యం కాదు...ఇందులో అసలు మతలబు తెలుసుకోవాల్సిందే...

రాష్ట్రంలో అధికారంలోకి రాగానే విద్యుత్ సమస్య పరిష్కరించామనీ, అదంతా తమ గొప్పేనని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. ఇదంతా ప్రభుత్వం సాధించిన విజయమని కొందరు వూదర కొడుతున్నారు. వాస్తవాలు తెలియకుంటే ఈ ప్రచారం నిజమని నమ్మే ప్రమాదం ఉంది. నిజానికి ప్రస్తుతం దేశం మొత్తం అనేక రాష్ట్రాల్లో మిగులు విద్యుత్తు పరిస్థితులు నెలకొన్నాయి. అమ్ముదామన్నాకొనే నాధుడు లేడు. గతంలో మొదలు పెట్టిన వేల మెగా వాట్ల ప్రాజెక్టులు 2015 నుండి ఉత్పత్తి మొదలు పెట్టడం ఇందుకు ప్రధానమైన కారణం. ఈ వివరాలన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థ సి‌ఈ‌ఏ 2017-18 నివేదికలో స్పష్టంగా ఇవ్వబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ (సి‌ఈ‌ఏ)  2017-18 వార్షిక నివేదిక ప్రకారం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా పరిస్థితి:

2016-17 లో కోతలు లేకుండా మిగులు విద్యుత్తు ఉన్న రాష్ట్రాలు

చండీఘర్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా , గుజరాత్, గోవా , మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘర్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, పాండిచేరి, కేరళ, సిక్కిం, ఒడిశా, వెస్ట్ బెంగాల్ , జార్ఖండ్, మేఘాలయ. మొత్తం 19 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో అసలు విద్యుత్ కోతలు లేవు. ఇంకా రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ , మిజోరాం , నాగాలాండ్, త్రిపుర, బీహార్ రాష్ట్రాల్లో కేవలం 1 నుండి 2 శాతం లోటు ఉంది. 

అలాగే 2017-18 సంవత్సరంలో...

27 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యుత్ కొరత ఉండదని, మిగిలిన రాష్ట్రాల్లో కూడా అతితక్కువ కొరత ఉంటుందనీ, ఒకవేళ ఉన్నా వాళ్ళు బహిరంగ మార్కెట్లో విద్యుత్తును కొనుక్కోవడం ద్వారా కోతను అధిగమించడం సాధ్యమవుతుందనీ రిపోర్టులో పేర్కొన్నారు. 

2017-18లో దేశంలో అవసరమైన విద్యుత్తు 1229661 మిలియన్ యూనిట్లు కాగా, లభ్యత 1337828 మిలియన్ యూనిట్లు, మిగులు 108167 మిలియన్ యూనిట్లు. అంటే అవసరమైన విద్యుత్తు కన్నా లభ్యత ఎక్కువగా ఉందన్నమాట. తెలంగాణ వచ్చిన తరువాత మొదలు పెట్టిన ఒక్క ప్రాజెక్టూ ఇప్పటివరకూ ఉత్పత్తి మొదలు పెట్టలేదు. ఉత్పత్తి చేస్తున్నవన్నీ గతంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులే... రైతులు కూడా 9గంటల విద్యుత్తును సక్రమంగా సరఫరా చేయమని అడుగుతున్నారు తప్ప 24గంటల విద్యుత్తును కోరటంలేదు. భూగర్భజలాలు పెరిగిన తరువాత 24గంటల సరఫరా చేయొచ్చని రైతులు మొత్తుకుంటున్నా వినడంలేదు.

వ్యవసాయానికి 24గంటల విద్యుత్ సరఫరాకు సుమారు ₹10000కోట్ల భారం విద్యుత్ సంస్థలపై పడుతుంది. ప్రభుత్వం మాత్రం కేవలం ₹5500కోట్ల మేరకే భారాన్ని భరిస్తానంటున్నది. ఇప్పటికే విద్యుత్ సంస్థలు చేస్తున్న అదనపు విద్యుత్ కొనుగోళ్ళ ఖర్చులకు  ప్రభుత్వం చెల్లింపులు చేయకపోవడంతో విద్యుత్ సంస్థలు ఆర్ధికంగా నష్టాల బాట పట్టాయి. రైతులకు గిట్టుబాటు ధర లేదు...దొరికేవన్నీ నకిలీ విత్తనాలే... పంటల బీమా లేదు...రుణ మాఫీ అరకొరే...కొత్తగా రుణాలు దొరకడంలేదు. ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గంలోని దేశంలో అత్యధిక రైతు ఆత్మహత్యలు రికార్డు అయితే పట్టించుకునే నాధుడు లేడు... తెలంగాణ వచ్చిన తరువాత విద్యుత్ షాకుల ద్వారా మరణించిన వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది.2014లో 400 చనిపోతే, 2017నాటికి మరణాల సంఖ్య 600దాటింది.సరఫరాలో నాణ్యత పెరుగుతే, కరెంటు షాకుతో మరణాలు ఎందుకు పెరుగుతున్నట్లు? ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టకుండా, 24గంటల సరఫరా అంటూ ఊదరగొట్టడం దేనికి? కేవలం చర్చను పక్కదోవ పట్టించడానికి, పత్రికలలో కోట్ల రూపాయలు ప్రకటనలు ఇచ్చి పత్రికలను మరింత చెప్పు చేతల్లో ఉంచుకోడానికి, అన్ని రంగాల్లో తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోడానికి ముందుకు తెచ్చిందే 24గంటల విద్యుత్తు పేరుతో జరుగుతున్న 24గంటల ప్రచారం. వాస్తవం ఇదైతే మనోళ్లు ఇదంతా తమ ఘనతే అని వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తూ ప్రచారం. కేవలం పత్రికలలో ప్రకటనలకే ఈ మూడేళ్ళలో ప్రభుత్వం ₹ 500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది.

 

 ఇకనైనా ఈ ప్రచారాలు ఆపుతారా? జర..

ఇట్లు...

ప్రొ. కోదండరామ్

చైర్మన్, TJAC