హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ స్థానంలో కవిత ఓటమి చెందడంతో ఇద్దరికి కేబినెట్ లో అవకాశం లేకుండా  పోయింది. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డిలకు కేబినెట్‌లో చోటును కోల్పొయినట్టుగా ప్రచారం సాగుతోంది.

2018 డిసెంబర్ మాసంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కానీ,  సెప్టెంబర్  మాసంలో  మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో సురేష్ రెడ్డి పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ ఆయన పోటీ చేయలేదు. 

అయితే కొంత కాలం వేచి చూస్తే పార్టీలో మంచి పదవిని ఇస్తానని కేసీఆర్ సురేష్ రెడ్డికి ఆఫర్ ఇచ్చినట్టుగా ప్రచారం సాగింది. ఈ ఆఫర్ మేరకు సురేష్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరినట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

నిజామాబాద్ జిల్లాకు చెందిన  రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని  అదే జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు.ఈ సమయంలోనే సురేష్ రెడ్డిని టీఆర్ఎస్‌లో చేర్చుకొన్నారు.

డి.శ్రీనివాస్ ను ఎదుర్కొనేందుకే కేఆర్ సురేష్ రెడ్డిని టీఆర్ఎస్‌లో చేర్చుకొన్నారని ఆ సమయంలో టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగింది.కేఆర్ సురేష్ రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం కల్పించనున్నట్టుగా కేసీఆర్ హామీ ఇచ్చారని సమాచారం.

లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎర్రజొన్న, పసుపు రైతులు ఆందోళన బాట పట్టారు. అంతేకాదు రైతులు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు కూడ దాఖలు చేశారు. ఈ సమయంలో  మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు ఇంటికి వెళ్లి టీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానించారు.ఆ సమయంలో మండవ వెంకటేశ్వరరావు టీడీపీలో ఉన్నారు.

చాలా కాలం నుండి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. రైతుల్లో మండవ వెంకటేశ్వరరావుకు మంచి పేరుంది. దీంతో మండవ వెంకటేశ్వరరావును పార్టీలో చేర్చుకోవడం ద్వారా ప్రయోజనం ఉంటుందని కేసీఆర్ భావించారు. కానీ ఎన్నికల్లో పెద్దగా ప్రయోజనం కన్పించలేదు.

అంతకుముందే  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడ మండవ వెంకటేశ్వరరావును టీఆర్ఎస్ లో చేరాలని కోరారు. కానీ ఆయన మాత్రం టీఆర్ఎస్‌లో చేరలేదు.నిజామాబాద్ ఎంపీ స్థానంలో కవిత ఓటమి చెందడం రాజకీయంగా ఈ ఇద్దరు సీనియర్ నేతలకు నష్టం కల్గించేదిగా ఉందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

కేసీఆర్ కేబినెట్: ఇద్దరికి ఉద్వాసన, వారెవరు?

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....