కౌన్ బనేగా కరోడ్ పతి షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బిగ్ బీ యాంకరింగ్ ఈ షోకు హైలెట్. ఇప్పుడు ఈ షో 12వ సీజన్ నడుస్తుంది. దేశవ్యాప్తంగా ఈ షోకు అభిమానులున్నారు. దేశవ్యాప్తంగా ఎంతోమంది ఈ షోలో పాల్గొనాలని ఉవ్విళూరతారు. అయితే ఈ షోలో తెలంగాణ నుండి సబితా రెడ్డి అనే ఓ టీచర్ పాల్గొని తన సత్తా చాటింది.

సబితా రెడ్డి హైదరాబాద్‌లోని అల్వాల్‌ ప్రాంతంలో  టీచర్‌గా పనిచేస్తున్నారు. కేబీసీ అంటే ఎప్పుడూ సరదాగా, విజ్ఞానవంతంగా సాగిపోతుంటుంది. అమితాబ్ కూడా ఎప్పుడూ సరదా సరదాగా షోను నడిపిస్తారు. అయితే సబితా లైఫ్‌ జర్నీ గురించి తెలుసుకుని ఆయన చలించిపోయారు. చిన్నతనంలోనే భర్తను కోల్పోయి, పిల్లలను పెంచి పెద్ద చేసిన సబిత తీరు పట్ల అమితాబ్ ప్రశంసలు కురిపించారు. 

సబితది స్ఫూర్తిమంతమైన జీవన ప్రయాణమని అమితాబ్‌ కొనియాడారు. ఒక టీచర్‌గా పిల్లలకు మంచి విద్యను అందిస్తానని సబిత చెప్పుకొచ్చారు. జీవితంలో పిల్లలకు ఆస్తులు ఇవ్వకున్నా కానీ, మంచి విద్యను అందివ్వాలని చెప్పారు. సబిత పాల్గొన్న కేబీసీ సీజన్‌ 12, ఆరో ఎపిసోడ్‌ సోనీ టీవీలో ఈ రోజు రాత్రి (మంగళవారం) ప్రసారమవుతుంది.

కేబీసీ సీజన్‌ 12, ఆరో ఎపిసోడ్‌లో సబితారెడ్డితో పాటు మరో 7 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. కంటెస్టెంట్‌ ప్రదీప్‌కుమార్‌ సూద్‌ బిగ్‌ బీ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి 12.5 లక్షల రూపాయలు గెలుచుకుని ఆట నుంచి పక్కకు తప్పుకున్నారు. కేబీసీలో పాల్గొనడం తన తల్లి కోరిక అని ప్రదీప్‌ చెప్పారు. ఆమె కల నెరవేరినందుకు ఆనందంగా ఉందన్నారు. గతంలో కేబీసీలో పాల్గొనేందుకు ప్రయత్నించానని ఈసారి ఆ అవకాశం దక్కిందని పేర్కొన్నారు. ఆయన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సీనియర్‌ డివిజనల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.