హైదరాబాద్‌: మహేష్ కత్తిని, పరిపూర్ణానంద స్వామిని నగరం నుంచి బహిష్కరించడానికి గల కారణాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గవర్నర్ నరసింహన్ కు వివరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతోనే వారికి బహిష్కరణ విధించినట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నగరంలో కర్ఫ్యూ విధించలేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, కాంగ్రెసు ప్రభుత్వాల హయాంల్లో పలుమార్లు హైదరాబాద్ పాతబస్తీలో కర్ఫ్యూ పెట్టాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. 

నగరంలో అవాంఛనీయ సంఘటనలను నివారించి, కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే వారిద్దరిపై నగర బహిష్కరణ వేటు వేసినట్లు తెలిపారు. 

 శ్రీరాముడిపై కత్తి మహేశ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దీనికి వ్యతిరేకంగా శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద  ఆందోళనకు దిగడం వంటి చర్యల వల్ల నగరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని కేసీఆర్‌ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వివాదంలో కొన్ని వార్తా చానల్స్‌ వ్యవహరించిన తీరు పట్ల కూడా ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. 

స్వామి పరిపూర్ణానందకు నగర బహిష్కరణ విధించడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర నేతలు కొన్ని రోజుల కింద గవర్నర్‌ను కలిసిన నేపథ్యంలో సీఎం గవర్నర్‌కు వివరణ ఇచ్చారు.

ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌.నరసింహన్‌ను కలిసి,  ప్రస్తుత రాజకీయ, పాలనాపరమైన అంశాలపై కెసిఆర్ చర్చించారు. రైతులకు రూ.5లక్షల జీవిత బీమా సదుపాయం కల్పించేందుకు ఆగస్టు 15న ప్రారంభించ తలపెట్టిన రైతు బీమా పథకం ఉద్దేశాలను, వివరాలను తెలియజేశారు. వచ్చే సెప్టెంబర్‌ నుంచి సాగునీటి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తామన్నారు.