హైదరాబాద్: ఎంఐఎం పార్టీ శాసన సభాపక్ష నేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై జరుగుతున్న రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టేశారు కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి. అక్బరుద్దీన్ ఓవైసీ ప్రసంగంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవని తేల్చిచెప్పారు.  

జూలై 23న కరీనంగర్ జిల్లాలో జరిగిన ఎంఐఎం పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరైన అక్బరుద్దీన్ ఓవైసీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అలాగే పార్టీ కోసం కీలక ప్రసంగం కూడా చేశారు. 

అయితే ఆ సమావేశంలో అక్బరుద్దీన్ ఓవైసీ ఒక వర్గాన్ని అవమానించే విధంగా, విద్వేషపూరితంగా, రెచ్చగొట్టేవిధంగా ప్రసంగించారని గత మూడు రోజులుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ లలో కూడా అక్బరుద్దీన్ వీడియో హల్ చల్ చేస్తోంది. 

అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బాస సత్యనారాయణ సీపీకి ఫిర్యాదు చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అక్బరుద్దీన్ ప్రసంగించిన వీడియోను అనువాద నిపుణులకు పంపించారు.   

అనువాద నిపుణుల సహాయంతో ట్రాన్సులేషన్ చేయించి, వీడియో రికార్డింగ్‌ను, అనువాద ప్రతిని న్యాయనిపుణుల సలహా కోసం పంపారు. అక్బరుద్దీన్ ప్రసంగంలో ప్రతీ పదాన్ని, వ్యాఖ్యలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎక్సపర్ట్ ట్రాన్స్ లేషన్ కమిటీ నివేదిక ఇచ్చింది. 

అక్బరుద్దీన్ ఓవైసీ ప్రసంగంలో ఎలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు గానీ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు గానీ లేవని తేల్చి చెప్పారు. ఈ ప్రసంగంపై ఎలాంటి కేసులు నమోదు చేసే అవకాశం కూడా లేదని నిపుణులు పోలీసులకు సలహా సైతం ఇచ్చారు.

న్యాయనిపుణుల సలహా మేరకు అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదని కరీంనగర్ సీపీ వి.బి.కమలాసన్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించి శాంతి భద్రతల పరిరక్షణ చర్యల్లో పోలీసులకు సహకరించాల్సిందిగా కోరుతున్నట్లు సీపీ కమలాసన్ రెడ్డి స్పష్టం చేశారు.  

ఈ వార్తలు కూడా చదవండి

అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై విజయశాంతి ఫైర్: కేసీఆర్ స్పందించాలని డిమాండ్

కొందరు కావాలని చేస్తున్నారు... చట్టాన్ని ఉల్లంఘించలేదన్న అక్బరుద్దీన్

వైద్యులు చెప్పారు, ఏ క్షణమైనా నేను పోవచ్చు: అక్బరుద్దీన్