హైదరాబాద్: బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కోడలు నల్లపురెడ్డి సుహారిక (38) గురువారం అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. హైదరాబాదులోని గచ్చిబౌలిలో గల మీనాక్షీ బాంబూస్ విల్లా నంబర్ -28లో అద్దెకు ఉంటున్న పవన్ రెడ్డి ఇంట్లో విందు చేసుకుంటున్న సమయంలో డ్యాన్స్ చేస్తూ ఆమె కుప్పకూలిపోయారు. 

సుహారికకు కన్నా చిన్న కుమారుడు ఫణీంద్రతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ నంబర్ 11లో ఉం్టున్నారు. సుహారిక తల్లి మల్లిసాగరిక కూడా వీరితో ఉంటోంది. సుహారిక చెల్లె నిహారిక భర్త ప్రవీణ్ రెడ్డికి బంజారాహిల్స్ కు చెందిన వివేక్, విహాస్, పవన్ రెడ్డిలు మిత్రులు. వీరు తరుచుగా పార్టీలు చేసుకుంటూ ఉంటారు. 

గురువారం ఉదయం 7.30 గంటలకు వారంత పవన్ రెడ్డి ఇంట్లో పార్టీకి ప్లాన్ చేసుకున్నారు. సుహారిక భర్త ఫణీంద్రకు వీలు కాకపోవడంతో సుహారిక మాత్రమే పార్టీకి వెళ్లారు. అప్పటి నుంచి రెండు గంటల పాటు విరామం లేకుండా డ్యాన్స్ చేయడంతో స్పృహ తప్పి పడిపోయారు. సమీపంలోని ఏఐజీ ఆస్పత్రికి ఆమెను తరలించారు. అరగంట పాటు వైద్యులు చికిత్స అందించినా ఆమెలో కదలిక కనిపించలేదు. దీంతో ఆమె మరమించినట్లు ధ్రువీకరించారు. 

అయితే సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వైద్యులతో మాట్లాడారు. విందులో పాల్గొన్నవారినుంచి వివరాలు సేకరించారు. తన కూతురు మరణంపై అనుమానం లేదని సుహారిక తల్లి మల్లిసాగరిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. 

డ్యాన్స్ చేయడం వల్లనే స్పృహ తప్పిపోయారని, ఆమె మరణంపై ఏ విధమైన అనుమానాలు లేవని భర్త ఫణీంద్ర కూడా స్టేట్ మెంట్ ఇచ్చారు. కార్డియాక్ అరెస్టు తో మరణించి ఉండవచ్చునని అన్నారు. అయితే, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతనే మరణానికి గల కారణాలు తెలుస్తాయని సీఐ రవిందర్ చెప్పారు. 

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి పంపించారు. అయితే, పోలీసులు సుహారిక మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. అంత ఉదయం ఎందుకు పార్టీ చేసుకోవాల్సి వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నారు.