టీఆర్ఎస్ నేత, కల్వకుంట్ల కవిత రేపు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ శాసనమండలి ప్రాంగణంలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 12.45 గంటలకు ఆమెతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

కాగా ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఆమె ప్రమాణ స్వీకారం చేయాల్సి వుంది. అయితే నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపు అనంతరం ఆమెకు పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Also Read:ఎమ్మెల్యే‌కు కరోనా: హోం క్వారంటైన్‌లోకి ఎమ్మెల్సీ కవిత

అయితే కవితను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అక్కడ ఆయనకు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది.

దీంతో ఎమ్మెల్యే క్వారంటైన్‌కు వెళ్లారు. ఆ విషయం తెలుసుకున్న కవిత సైతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. అలాగే తనను కలిసిన వారు కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరిన సంగతి తెలిసిందే.