యశోద ఆసుపత్రి నుండి డిశ్చార్జ్: పదేళ్ల తర్వాత నందినగర్ ఇంటికి కేసీఆర్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పదేళ్ల తర్వాత నందినగర్ ఇంటికి వెళ్లారు.యశోద ఆసుపత్రి నుండి నేరుగా ఆయన ఆ ఇంటికి చేరుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పదేళ్ల తర్వాత హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లోని నందినగర్ ఇంటికి శుక్రవారం నాడు చేరుకున్నారు.
ఈ నెల 7వ తేదీన ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ బాత్రూంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాలు జారిపడ్డారు. దీంతో ఆయన ఎడమ కాలి తుంటి ఎముక విరిగింది. అదే రోజున హైద్రాబాద్ యశోద ఆసుపత్రిలో కేసీఆర్ ను చేర్పించారు. ఈ నెల 8వ తేదీన యశోద ఆసుపత్రిలో కేసీఆర్ కు శస్త్రచికిత్స చేశారు. ఈ నెల 15న (శుక్రవారం) యశోద ఆసుపత్రి నుండి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా దాదాపుగా తొమ్మిదిన్నర ఏళ్ల పాటు కేసీఆర్ బాధ్యతలు నిర్వహించారు. ఈ ఏడాది నవంబర్ 30న జరిగిన పోలింగ్ లో కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి అధికారాన్ని కోల్పోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. సీఎంగా ఉన్న సమయంలో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నివాసం ఉన్నారు. అధికారం కోల్పోవడంతో ప్రగతి భవన్ ను కేసీఆర్ కుటుంబం ఖాళీ చేసింది.
ప్రగతి భవన్ ను జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా మార్చారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజలు నేరుగా ఇక్కడికి వచ్చి తమ సమస్యలపై సీఎంకు వినతిపత్రాలు ఇవ్వవచ్చు. ప్రజా భవన్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికార నివాసంగా మారింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో కూడ కేసీఆర్ ఇదే నివాసంలో ఉన్నారు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రగతి భవన్ లోకి కేసీఆర్ మారారు. అధికారంలో కోల్పోవడంతో కేసీఆర్ తిరిగి నందినగర్ నివాసానికి మారారు.