కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పిసి ఘోష్ కమీషన్ ఇచ్చిన రిపోర్ట్ పై స్టే ఇవ్వాలన్న కేసీఆర్ పిటిషన్ కు వ్యతిరేకంగా హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అయినా కేసీఆర్ కు ఊరట లభించింది… అది ఎలాగో తెలుసా? 

KCR : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసిఆర్ ను కాళేశ్వరం వ్యవహారం వెంటాడుతోంది. తెలంగాణ ఏర్పాటుతర్వాత వరుసగా పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన బిఆర్ఎస్ ఓటమిపాలై అధికారాన్ని కోల్పోడానికి ఈ కాళేశ్వరం కూడా ఓ కారణమే. సరిగ్గా ఎన్నికల సమయంలో ఈ ప్రాజెక్ట్ పిల్లర్ల కుంగిపోవడం అప్పటి ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది… ఇది ప్రజలపై కూడా ప్రభావం చూపింది. అయితే ఓటమి తర్వాత కూడా బిఆర్ఎస్ నాయకులకు కాళేశ్వరం కష్టాలు తప్పడంలేదు... విచారణకు హాజరవడంతో పాటు న్యాయస్థానాలచుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇలా కేసీఆర్ కలల ప్రాజెక్ట్ ఇప్పుడు ఆయనకే కంటిమీద కునుకులేకుండా చేస్తోంది... తాజాగా తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ కు చుక్కెదురయ్యింది.

ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగాయని... నాసిరకంగా ప్రాజెక్టును నిర్మించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఘోష్ కమీషన్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని తేల్చింది. దీంతో ప్రభుత్వం ఎక్కడ చర్యలు తీసుకుంటుందోనని కేసీఆర్ కు కంగారు మొదలైనట్లుంది.. అందుకే ఘోష్ కమీషన్ రిపోర్టుపై స్టే కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు ఈ కమీషన్ పై స్టే ఇచ్చేందుకు అంగీకరించలేదు. ప్రభుత్వం తరపు ఏజీ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం కేసీఆర్ కోరినట్లు స్టే ఇవ్వకుండానే విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ అధ్యక్షతన ఓ విచారణ కమీషన్ ను ఏర్పాటుచేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కమీషన్ ఇటీవలే విచారణను పూర్తిచేసి ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించింది. దీనిని రేవంత్ కేబినెట్ చర్చించి ఆమోదించింది. అసెంబ్లీలో దీనిపై చర్చించాక చర్యలు తీసుకుంటామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 

అయితే కాళేశ్వరం కమీషన్ రిపోర్ట్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందని... రాజకీయ కక్షతో తమను బదనాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని మామాఅల్లుడు హైకోర్టును ఆశ్రయించారు.. కానీ తాజా విచారణలో వీరికి ఊరట లభించలేదు... స్టే ఇవ్వడానికి కోర్టు ఒప్పుకోలేదు.

కోర్టు స్టే ఇవ్వకున్నా ప్రభుత్వం కాళేశ్వరం కమీషన్ రిపోర్ట్ పై తొందరపాటు చర్యలు తీసుకోమని హైకోర్టుకు తెలపడం కేసీఆర్ ఊరటనిచ్చే అంశం. కేసీఆర్, హరీష్ రావు ఇద్దరూ ప్రస్తుతం ఎమ్మెల్యేలే... కాబట్టి అసెంబ్లీలో కాళేశ్వరం కమీషన్ రిపోర్టుపై చర్చ తర్వాతే ముందుకు వెళతామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కాబట్టి ఇక ఘోష్ కమీషన్ పై స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయస్థానం పేర్కొంది... అయితే ఈ నివేదిక పబ్లిక్ డొమైన్ లో ఉంటే వెంటనే తొలగించాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.