తెలంగాణలో సిఎం కేసిఆర్ వాడే భాష, యాషను అనుకరించేవారి సంఖ్య వందలు, వేలు, లక్షల్లోనే ఉండొచ్చు. క్షేత్ర స్థాయిలో నాయకులు, కార్యకర్తలు కూడా కేసిఆర్ భాషను వంటపట్టించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

తాజాగా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా కేసిఆర్ భాషను వంటబట్టించుకున్నట్లు కనబడుతున్నది. ఇటీవల కడియం శ్రీహరి వరంగల్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన సహజ శైలిలో కాకుండా కేసిఆర్ భాషలో కడియం ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు. పదే పదే కాంగ్రెస్ సన్నాసులు, సన్నాసులు అంటూ సంబోధించారు.

ఈ సందర్భంగా కడియం కాంగ్రెస్ పై తిట్ల దండకం ఎలా ఉందో ఒకసారి చదవండి.

అవినీతి, అక్రమాలకు పేటెంట్ కాంగ్రెస్ పార్టీదే.

వరంగల్ జిల్లా అభివృద్ధి కోసం ఏనాడైనా కాంగ్రెస్ ప్రయత్నించిందా?

మిషన్ భగీరథ లాంటి పథకాలు కాంగ్రెస్ మట్టి బుర్రలకు తట్టాయా?

కాంగ్రెస్ నేతలు చరిత్ర మరచి మాట్లాడుతున్నారు.

గతంలో ఇసుక దందా, బ్యాంకుల దోపిడీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది.

యూనివర్శిటీ భూములు కబ్జా చేసి సెటిల్మెంట్లు చేసిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ దే.

వైఎస్ హయాంలో ప్రాజెక్టుల్లో వేల కోట్ల సొమ్ము నిస్సిగ్గుగా దోచుకున్నారు.

ఎన్నడూ తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచించని సన్నాసులు కాంగ్రెస్ వారు.

కోర్టుల్లో కేసులు వేస్తూ స్టే లు తేవడం కంటే దుర్మార్గులు ఇంకొకరు లేరు.

వరంగల్ జిల్లాకు చెందిన ఒక పెద్దాయన మంత్రిగా ఉండి (పొన్నాల లక్ష్మయ్య) వైఎస్ దోపిడీకి బ్రోకర్ గా ఉండి జిల్లాకు అపఖ్యాతి మూటగట్టారు.

ఇలా వరంగల్ లో కాంగ్రెస్ పార్టీపై కేసిఆర్ భాషలో విరుచుకుపడ్డారు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి.