తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. తాను టిడిపిలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటి కాలంలో నమోదైన కేసు విషయాన్ని కడియం ప్రస్తావించారు. ఉన్నట్లుండి కడియం ఎందుకు ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. ఆ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించారు. పూర్తి సమాచారం కోసం కింది వార్తను చదవండి.

భూపాలపల్లి జిల్లా, వెంకటాపురం మండలం, రామానుజపురం గ్రామంలో రైతు బంధు కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేశారు ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు సహచర గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్, ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్,  కలెక్టర్ అమేయకుమార్ స్థానిక అధికారులు, నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడారు. ఆయనేమన్నారంటే?

తెలంగాణ రాకముందు వ్యవసాయం ఎలా ఉంది..కరెంట్ రాక, విత్తనాలు, ఎరువులు దొరకక, పొలాలు ఎండిపోయి రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. ఎరువులు, విత్తనాల కోసం క్యూలో నిలబడి, చెప్పులు క్యూలో పెట్టే పరిస్థితి ఉండేది. నేను స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే గా ఉన్నపుడు జనగామలో ఎరువుల కోసం ఉప్పలయ్య అనే రైతు గంటల తరబడి క్యూలో నిలబడి అక్కడ ఎరువులు అయిపోతే ఇంకొక చోట దుకాణంలో ఇస్తున్నారంటే పరిగెత్తుతూ అలిసి కుప్పకూలి పోయారు. అక్కడే చనిపోయారు. దానికి నిరసనగా నేను ఆందోళన చేస్తే ఇప్పటికీ ఆ కేసు నా మీద ఉంది.

కానీ ఈ 4 ఏళ్లలో ఎరువులు, విత్తనాల కోసం ఎపుడైనా క్యూలో నిలబడ్డారా? లేదు. తెలంగాణ వచ్చాక వ్యవసాయానికి  24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్. ఉచిత కరెంట్, ఎరువులు, విత్తనాలు, కోటి ఎకరాలను మాగాణి చేసే లక్ష్యంతో వేగంగా ప్రాజెక్టుల  నిర్మాణం, 38 లక్షల మంది రైతులకు 17 వేల కోట్ల రూపాయల పంట రుణాల మాఫీ, ఇప్పుడు ఎకరానికి రెండు పంటలకు 8000 రూపాయల పంట పెట్టుబడి ఇస్తున్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ లు అనేక రాష్ట్రాల్లో పాలన చేస్తున్నాయి ఏ ఒక్క రాష్ట్రంలో నైనా పంట రుణాల మాఫీ చేశారా?, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చారా? పంట పెట్టుబడి ఇస్తున్నారా? అని అడుగుతున్నా అన్నారు.

దేశంలో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం లో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఏ రాష్ట్రం లో అమలు కావడం లేదు. నేడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది. పేదింట్లో ఆడపిల్ల పెళ్లి చేయడానికి మొదట్లో 51 వేల రూపాయలు, ఆ తర్వాత అవి సరిపోవడం లేదని సీఎం కేసీఆర్ స్వయంగా ఆలోచించి 75వేల రూపాయలు చేశారు. ఇప్పుడు ఆ 75వేల రూపాయలు కూడా సరిపోవడం లేదని గుర్తించి 1,00,116 రూపాయలు చేశారు. ఈ రోజు పేదింట్లో ఆడపిల్ల పెళ్లి అయితే కులం, మతం అనే తేడా లేకుండా లక్షా 116 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనది.

ఇక కేసీఆర్ కిట్. ఈ రోజు ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవం అయితే గర్భిణీ స్త్రీలకి ప్రసవానికి ముందు 3 నెలలు, తరవాత 3 నెలలు మొత్తం 6 నెలలు , నెలకు 2000 చొప్పున 12 వేల రూపాయలు, ఆడపిల్ల పుడితే మరొక 1000 రూపాయలు కలిపి 13000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దీనితో పాటు 15 రకాల వస్తువులతో కేసీఆర్ కిట్ ఇస్తున్నారు. దీనిలో తల్లికి రెండు చీరలు, పిల్లకు రెండు డ్రెస్సులు, న్యాప్కిన్లు, సబ్బులు, పౌడర్లు, నూనె, బెడ్ ఇలా అన్ని ఇస్తున్న గొప్ప ముఖ్యమంత్రి మన సీఎం కేసీఆర్.

తెలంగాణ వస్తే ఎమోస్తది అన్నవాళ్లకు ఇవన్నీ ఇప్పుడు కనపడడం లేదా అని ప్రశ్నించారు. కొంతమంది పంట పెట్టుబడి తీసుకుంటూనే విమర్శిస్తున్నారు. అందరూ ప్రభుత్వ సాయం పొందాలి కానీ మంచి, చెడు తెలుసుకొని మాట్లాడాలి. రామనుజపురం గ్రామంలో ఈ ఏడాది నుంచి హైస్కూల్ మంజూరు చేస్తున్నా. ఈ వచ్చే విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి ఇక్కడ ప్రారంభం అవుతుంది. ఇందుకు 6 అదనపు గదులు, 60 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నాను. మీ పిల్లలందరిని సర్కారు బడుల్లోనే చేర్పించాలి. ఒక్క ప్రైవేట్ స్కూల్ బస్ ఈ ఊరు నుంచి బయటకు పోవద్దు. మీ ఊరు వాళ్లంతా కలిసి తీర్మానం చేసి ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చేర్పించాలి.