సిఎం చెప్పిన పనులే చేయరా అని నిలదీసిన ఇద్దరు మంత్రులుపనిచేసే మూడ్ లోకి రావాలని హితవునీళ్లు నమిలిన ఆమ్రపాలి, శృతి ఓజా

తెలంగాణ మంత్రులు కడియం శ్రీహరి, కేటిఆర్ వరంగల్ అర్బన్ కలెక్టర్ తోపాటు వరంగల్ కమిషనర్ శృతి ఓజాలపై సీరియస్ అయ్యారు. అభివృద్ధి పనుల్లో అధికారుల నిర్లక్ష్యంపై కడియం, కేటిఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో వీరి తీరు సరిగా లేదని మందలించారు.

రోడ్లు వేశాక పైపులైన్లు వేయడమేంటని వారిద్దరినీ ప్రశ్నించారు. సిఎం చెప్పిన పనులు కూడా చేయకపోతే ఇంకేమి చేస్తారని నిలదీశారు. మంత్రులిద్దరూ కలెక్టర్ ఆమ్రపాలి, కమిషనర్ శ్రుతిఓజాలకు ప్రశ్నల వర్షం కురిపించడంతో సమాధానాలు లేక తడుముకున్నారు ఆమ్రపాలి, శృతి ఓజా లు.

మరోవైపు ఎమ్మెల్యేలకు సైతం క్లాస్ ఇచ్చారు ఇద్దరు మంత్రులు. అభివృద్ధి పనులను ఎమ్మెల్యేలు ఎందుకు పట్టించుకోవడం లేదని చురకలేశారు. నియోజక వర్గ పరిధిలతో మొండి పంచాయతీలు వద్దని ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశనం చేశారు.

ఏడాదిలోగా కచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లన్ని పూర్తి కావాలని ఆదేశాలు ఇచ్చారు. సిఎం చెప్పిన పనులకు రేపే టెండర్లు పిలవండి...మంజూరీలిస్తానని మంత్రి కేటిఆర్ హామీ ఇచ్చారు. పనిచేసే మూడ్ లోకి రండి అంటూ అధికారులకు హితవు పలికారు.

ఇదంతా వరంగల్ మునిసిపల్ శాఖ సమీక్షా సమావేశంలో జరిగింది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి కడియం, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ హాజరై అధికారులను నిలదీశారు.