ప్రగతి భవన్ వద్దకు కేఏ పాల్.. అడ్డుకున్న పోలీసులు.. అందుకే వచ్చానంటూ కామెంట్స్..
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌కు వచ్చారు. తాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చానని చెప్పారు. అయితే కేఏ పాల్‌కు అపాయింట్‌మెంట్ లేకపోవడంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హల్‌చల్ చేశారు. కేఏ పాల్ సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌కు వచ్చారు. తాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చానని చెప్పారు. అయితే కేఏ పాల్‌కు అపాయింట్‌మెంట్ లేకపోవడంతో.. అనుమతి లేదని పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. అయితే పోలీసులు తనను ప్రగతి భవన్ లోపలికి అనుమతించకపోవడాన్ని కేఏ పాల్ తప్పుబట్టారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన కేఏ పాల్.. అఖిలేష్ యాదవ్ కంటే తానే గొప్ప లీడర్‌ను అని, తనకు ఎందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
అక్టోబర్ 2న నిర్వహించబోయే ప్రపంచ శాంతి మహా సభలకు కేసీఆర్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకే తాను ఇక్కడికి వచ్చానని కేఏ పాల్ తెలిపారు. సీఎంతో భేటీ కోసం ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చినట్టుగా చెప్పారు. తనకు అపాయింట్‌మెంట్ ఇస్తే.. తెలంగాణ అభివృద్ది కోసం కేసీఆర్‌తో చర్చిస్తానని తెలిపారు. అప్పులు ఎలా తీర్చాలనేది అంశం చర్చించేందుకే ప్రగతి భవన్‌కు వచ్చినట్టుగా తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తే లేదని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల భేటీ గురించి ప్రశ్నించగా.. తాను దాని గురించి మాట్లాడేందుకు ఇక్కడకు రాలేదని అన్నారు. దేశాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ కుటుంబ పాలనేనని విమర్శించారు.