టీఆర్ఎస్ ఎంపీ కే. కేశవరావు ఆంధ్రా ఎంపీ అని రాజ్యసభ సెక్రటేరియేట్ స్పష్టం చేసిందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్. తుక్కుగూడ ఎక్స్‌అఫిషియో ఓటుకు సంబంధించి మంగళవారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నుంచి కూడా తమకు లేఖ అందిందన్నారు.

Also Read:ఢిల్లీకి ఎక్స్ అఫిషియో పంచాయతీ...కేకే పై బీజేపీ ఫిర్యాదు

ఆంధ్రా ఎంపీల లిస్ట్ కేకే నాలుగో వ్యక్తని.. తెలంగాణ రాజ్యసభ సభ్యుల లిస్ట్‌లో కేశవరావు పేరే లేదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. అంతకు ముందు తుక్కుగూడ మున్సిపల్ ఎన్నికల్లో 15వ వార్డులకు గాను బీజేపీ 9, టీఆర్ఎస్ 5 వార్డుల్లో విజయం సాధించాయి.

అయితే ఎక్స్అఫిషీయో సభ్యులతో టీఆర్ఎస్ తుక్కుగూడ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. ఎక్స్‌అఫిషీయో సభ్యుల్లో ఒకరైన ఎంపీ కేశవరావు వేసిన ఓటు వివాదాస్పదం అయ్యింది.

Also Read:నేరేడుచర్లలో కేవీపీకి ఓటు: ఉత్తమ్ తో గొడవ, మైక్ విరగ్గొట్టిన ఎమ్మెల్యే సైదిరెడ్డి

ఆయన ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారని బీజేపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. రాజ్యసభ బులెటిన్‌లోనూ కేశవరావు పేరు ఏపీ లిస్టులో ఉన్నట్లే చూపిస్తోందని, పక్క రాష్ట్రానికి చెందిన ఎంపీని తీసుకొచ్చి తెలంగాణలో ఓటు వేయించడం ఏంటని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

ఈ వ్యవహారంపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించి టీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలను ఎండగడతామని లక్ష్మణ్ తెలిపారు.  ఇతర పార్టీలతో కలిసి బీజేపీని ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ చేసిన కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.